“ఇప్పటి వరకు చెప్పింది చాలు.. ఇక, చాలు ఆపండి“ అంటూ.. ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించే సంస్థల కు, మీడియా సంస్థలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించేందుకు ఎన్నికల సంఘం వద్ద 21సంస్థలు రిజిస్టర్ చేసుకున్నాయి. వీటిని నిన్న మొన్నటి వరకు అనుమతించిన ఈసీ.. ఇప్పుడు వాటికి వద్దని ఆదేశాలు జారీ చేసింది. దీనికి కారణం.. తొలి దశనోటిఫికేషన్ రావడమే.
ఈ నెల రెండో వారంలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏడు విడతల్లో మొత్తం పార్లమెంటు, నాలుగు రాష్ట్రాల(ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్) అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను, సర్వేల ఆధారంగా ప్రీ పోల్ ఫలితాలను కూడా.. వివిధ సంస్తలు వెల్లడించాయి. ఏపీ సహా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనూ ఈ ఫలితాలు వచ్చాయి.
అయితే.. రెండు రోజుల కిందట తొలి దశ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాసంఘాల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా.. ఎగ్జిట్, ప్రీ పోల్ ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆయా సంస్థలకు నోటీసులు ఇచ్చింది. సర్వే ఫలితాలను ఆపేయాలని ఆదేశించింది.
మళ్లీ ఎప్పుడు..?
దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ , సర్వేలు.. ఏదైనా సరే.. ఎన్నికలు పూర్తయ్యాకే విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు ఏడు దశ ల్లో జరుగుతున్నాయి. ఇవి జూన్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఆ ఎన్నికలు పూర్తయ్యాకే ఫలితాలు విడుదల చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో ఏ ఫలితమైనా.. జూన్ 1 వ తేదీ సాయంత్రమే విడుదల చేయాలని సూచించింది.