ఏపీలో డ్రోన్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయనున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. ఫ్యూచర్ అంతా డ్రోన్ టెక్నాలజీదేనన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చే సేందుకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఐటీ, విజ్ఞానం, సంపాదనలో భారతీయులు చాలా సమర్థులని తెలిపారు. వీరి సరసన ఏపీ వారు కూడా ముందు నిలిచేలాచర్యలు తీసుకుంటున్నామన్నారు. తాజాగా మంగళగిరిలో అంతర్జాతీయ డ్రోన్ సదస్సును ప్రారంభించారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సదస్సులో దేశ, విదేశాల నుంచి డ్రోన్ ఉత్పత్తి, వినియోగదారులు హాజరై, స్థానికంగా అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా వివిధ దశల్లో వినియోగించే డ్రోన్లను కూడా పరిచయం చేయనున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు, స్టార్టప్‌లు కూడా ఏర్పడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. విజయవాడలో సంభవించిన వరదలు, ఆ సమయంలో డ్రోన్ల ద్వారా బాధితులకు అందించిన సేవలను కూడా వివరించారు. డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు అందించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సాంకేతితకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడిస్తే.. మరిన్ని అద్బుతాలు సాధించవచ్చన్నారు.
ఇంటి వద్దకే మందులు పంపిణీ చేయడంతోపాటు.. నేరస్తులను గుర్తించేందుకూ డ్రోన్లను వినియోగించను న్నట్టు తెలిపారు. పలు దేశాలు(ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఉటంకిస్తూ) డ్రోన్లను విద్వంసాలకు , యుద్ధానికి వినియోగిస్తున్నాయన్న సీఎం.. తాము మాత్రం అభివృద్ధికి డ్రోన్ టెక్నాలజీని వాడతామని చెప్పారు. యువతను ప్రోత్సహించి.. వారికి ఉపాధి లభించేలా కూడా చేస్తామని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, సాంకేతిక నిపుణులు కూడా హాజరయ్యారు.