అక్టోబర్ 22, 23వ తేదీల్లో ఏపీ రాజధాని అమరావతి లో డ్రోన్ సమ్మిట్ నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల పాటు జరగబోతున్న డ్రోన్ సమ్మిట్ కు పలువురు కేంద్ర మంత్రులతో పాటు కీలక నేతలు హాజరు కాబోతున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసేలాగా అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకారం డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై పలు శాఖల సెక్రటరీలు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమన్వయంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా జాతీయస్థాయిలో డ్రోన్ సమ్మిట్ నిర్వహించబోతున్నామని చెప్పారు. వ్యవసాయ, ఆరోగ్య లాజిస్టిక్ రంగాల్లో డ్రోన్ల వినియోగం, సర్వే, సెటిల్మెంట్ భూ రికార్డులు, డిజిటల్ ల్యాండ్ రికార్డుల తయారీలో కూడా డ్రోన్ ల వినియోగం వంటి అంశాలపై డిస్కషన్స్ ఉంటాయని సిఎస్ నీరబ్ కుమార్ తెలిపారు.
ఇక, డ్రోన్ సమ్మిట్ లో భాగంగా అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 8:00 వరకు విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఉన్న పార్క్ దగ్గర పలు సాంస్కృతిక కార్యక్రమాలు, 5వేల డ్రోన్లతో అతిపెద్ద డ్రోన్ షో నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రితోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొనబోతున్నారని చెప్పారు.