తెలంగాణ హైకోర్టు తాజాగా 16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల `పుష్ప 2` ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాకుండా ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు.
ఈ విషయం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. సోమవారం హైకోర్టులో సినిమా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఇష్యూను కూడా గుర్తు చేశారు.
సినిమా థియేటర్స్‌లోకి తెల్లవారుజామున, అర్థరాత్రి సమయంలో పిల్లలకు నో ఎంట్రీ ఉండాలని తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఏకీభవించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను అనుమతించవద్దని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్టేక్ హోల్డర్లతో అందరూ చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అలాగే ఫిబ్రవరి 22కు తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.