ప్రజల కష్టాలు తీర్చేందుకు నాయకులు ఉండాలి. వారి బాధలు పంచుకునేందుకు నాయకులు కావాలి. వారి సమస్యలు తీర్చేందుకు పార్టీలు, ప్రబుత్వాలు కృషి చేయాలి. కానీ, వారి కష్టాలే ఆలంబనగా.. తమ పీఠాలను పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. ఎంతటి వారినైనా ప్రజలు ఉపేక్షించబోరనేది.. అటు కేంద్రంలోనూ ఇటు ఏపీలోనూ స్పష్టంగా కనిపించింది. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్‌ను ఉత్తరాది ఆదరించి.. 100 స్థానాలు కట్టబెట్టింది. కానీ, ఇదే ప్రజల కష్టాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసి.. ఓట్లు దూసుకుందామని ప్రయత్నించిన..జగన్ ను ప్రజలు విసిరి కొట్టారు.
తాజాగా 1వ తేదీ పింఛన్లు పంపిణీ చేశారు. దీనికి వలంటీర్లను వాడలేదు. అందరూ పర్మినెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందినే.. కూటమి ప్రబుత్వం వినియోగించింది. వలంటీర్లే వెళ్లాలి.. వలంటీర్లు ఉంటేనే తప్ప.. పింఛన్లు పంపిణీ చేయలేమన్న వాదనను తిప్పికొట్టి.. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగిపోయారు.
అధినేత దిగి.. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే.. క్షేత్రస్థాయిలో నాయకులు పరుగులు పెట్టరా? ఇదే జరిగింది. కానీ, గత జూన్ 1, మే 1వ తేదీల విషయానికి వస్తే.. మాత్రం వలంటీర్లు ఉంటేనే ప్రజల కు మేలు జరుగుతుందని.. పింఛన్లు పంపిణీ చేస్తామని భీష్మించిన.. జగన్ వృద్దులు, దివ్యాంగులు, వింతతు వులను సచివాలయాల దాకా తీసుకువచ్చారు. బ్యాంకుల చుట్టూ తిప్పారు. ఫలితంగా 46 మంది వృద్ధులు చనిపోయారని అధికారికంగానే ప్రకటించాల్సి వచ్చింది.
అయితే.. ఇలా జరగడానికి చంద్రబాబే కారణమని.. ఆయన వల్లే వృద్ధులకు తిప్పలు వచ్చాయని జగన్ ప్రచారం చేసుకున్నారు. ఇలా.. జనాలను కష్టాలకు గురి చేసి.. తద్వారా.. చంద్రబాబును బూచిగా చూపించి.. ఓట్లు దండుకుందామని అనుకున్నారు. కానీ, నాణేనికి మరో వైపు చూస్తే.. ప్రభుత్వం ఉన్నది ప్రతిపక్షాలు కష్టాలు పెడితే.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికి కాదనే చర్చ తాజాగా వెలుగు చూసింది.
ఎన్ని కష్టాలు వచ్చినా.. వాటిని అధిగమించి.. ప్రజల కష్టాలు తీర్చాలని కోరుకుంటారు. ఇదే జరిగింది. రేపు ప్రతిపక్షం మరో కార్యక్రమానికి కూడా అడ్డు పడితే.. ఇలానే వదిలేసి.. ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందని భావించి ఉంటారు. జగన్ సర్కారుకు.. సామర్థ్యం లేదన్న వాదన కూడా.. జనంలో వినిపించింది. ఇవన్నీ.. ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. వలంటీర్లు లేకున్నా.. ఇవ్వచ్చని బాబు నిరూపించారు.