టీడీపీ నిర్వహించే `మహానాడు` చుట్టూ ఇప్పుడు ఆ పార్టీ రాజకీయాలు ముసురుకున్నాయి. ప్రస్తుతం మహానాడును నిలుపుదల చేస్తున్నట్టు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. నిజానికి ఏటా మే 28-30 వరకు మూడు రోజుల పాటు పార్టీ మహానాడును నిర్వహిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ హయాం నుంచి వస్తున్న సంప్రదాయం. ఆయన జీవించి ఉన్న కాలంలో విధిగా మహానాడను హైదరాబాద్లోను.. తర్వాత.. వివిధ జిల్లాల్లోనూ నిర్వహించారు.
ఇదే సంప్రదాయాన్ని చంద్రబాబు కూడా కొనసాగించారు. గత ఏడాది రాజమండ్రిలో నిర్వహించిన మహా నాడు వేదికగానే.. `సూపర్ సిక్స్` పథకాలను ప్రకటించారు. ఇవి జోరుగా మహిళల్లోకి వెళ్లాయి. ప్రచారం కూడా పొందాయి. ఇవి తమకు ఓట్లు రాలుస్తాయని కూడా .. చంద్రబాబు పార్టీ నాయకులు ఆశలు పెట్టు కున్నారు. ఇదెలా ఉంటుందనేది పోలింగ్ ఫలితం రోజు తెలుస్తుంది. అయితే.. ఈ ఏడాది మహానాడును వాయిదా వేయడం చర్చనీయాంశం అయింది.
కూటమి కట్టి ఎన్నికలకువెళ్లిన దరిమిలా.. గెలుపుపై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రజలు తమ వెంటే నడుస్తారని కూడా.. చంద్రబాబు లెక్కలు వేసుకున్నారు. పవన్ రాజకీయాలు, మోడీ వ్యూహాలు.. కూటమి సత్తా వంటివి తమకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ వర్గాల అంతర్గత చర్చల్లో తమకు 135-145 మధ్యలో సీట్లు వస్తాయని.. పార్టీ నాయకులు లెక్కలు చెబుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో మహానాడును నిర్వహించడం ద్వారా.. ఆ వేడిని కొనసాగించాలనేది సీనియర్ల మాట.
దీనిపై వారు చంద్రబాబుకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.కానీ, చంద్రబాబు మాత్రం.. ఎన్నికల ఫలితం రాలేదు కాబట్టి.. ఇప్పుడు మహానాడు నిర్వహించినా ఏమీ చెప్పలేని పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే వచ్చే ఏడాది మహానాడు నిర్వహిద్దామని.. ఈ ఏడాది దండలు-దణ్ణాలతో సరిపుచ్చుదామని ఆయన అంటున్నారు. కాదూ కూడదంటే.. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించే దిశగా ఆలోచన చేస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.