రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబు కు ప్రాణహాని ఉందా? ఆయన్ను టార్గెట్ చేశారా? ఆయన భద్రత సరిగా లేదా? జైలు ఆయనకు ఏ మాత్రం సేఫ్ కాదా? ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారా? కంటికి సర్జరీ అవసరమా? ఇలాంటి ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఆయన భద్రత మీద వస్తున్న ఆరోపణలకు ప్రచారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటి వేళ.. చంద్రబాబు భద్రత విషయంలో వినిపిస్తున్న ఆరోపణలకు.. జైల్లోని పరిస్థితులకు సంబంధించి జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ శుక్రవారం రాత్రి 8 గంటల వేళలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్లో ముఖ్యాంశాల్ని చూస్తే..
ఆరోపణ
చంద్రబాబు ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఆయన కంటికి సర్జరీ అవసరం ఉంది.
జైళ్ల శాఖ డీఐజీ
చంద్రబాబు కుడి కంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నిపుణులు సూచన చేశారు. కానీ.. వెంటనే చేయాల్సిన అవసరం ఉందా? అని అడిగితే అత్యవసరంగా చేయక్కర్లేదని చెప్పారు.
ఆరోపణ
మావోల పేరుతో లేఖ వచ్చింది
జై.డీ.
మావోల పేరుతో లేఖ వచ్చింది నిజమే. పోలీసుల నుంచి మాకు సమాచారం వచ్చింది. వెంటనే ఎస్పీ స్పందించి.. చంద్రబాబు భద్రతపై సమీక్షించి భద్రతను కట్టుదిట్టం చేశాం. విచారణలో లేఖ నకిలీదని తేలింది.
ఆరోపణ
జైల్లోకి కెమేరాలు ఎలా వచ్చాయి? చంద్రబాబు ఫోటోలు బయటకు రావటం వెనుక కుట్ర ఉంది
జై.డి.
ఎస్ కోటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దొంగతనం కేసులో జైలుకు వచ్చాడు. అతన్ని తనిఖీ చేయగా.. అతడి దుస్తుల్లో బటన్ కెమెరా గుర్తించాం. దాన్ని స్వాధీనం చేసుకొని పోలీసులకు ఇచ్చాం. బాబు కుటుంబ సభ్యులు ములాఖత్ కు వచ్చినప్పుడు డ్రోన్ లతో ఫోటోలు తీసిన అంశం మా వరకు రాలేదు. ఎవరూ కంప్లైంట్ చేయలేదు.
ఆరోపణ
వైద్య బులిటెన్ లో బరువు వివరాలు ఇవ్వట్లేదు
జై.డి.
వైద్య నిపుణులు రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వివరాల్ని కుటుంబ సభ్యులకు అందజేస్తున్నాం. కొన్ని పరీక్షలకు సంబంధించి వ్యక్తిగత వైద్యుల్ని సంప్రదించాలని చంద్రబాబు సూచన చేశారు. ఆ వివరాల్ని కోర్టుకు తెలిపాం. జైలు నిబంధనల ప్రకారం 15రోజులకు ఒకసారే హెల్త్ బులిటెన్ లో బరువు వివరాలు ఇస్తున్నాం.
కొసమెరుపు..
వైద్యులు కంటికి శస్త్రచికిత్స అవసరం అన్న తర్వాత.. మళ్లీ అవసరమా? కాదా? అని అడగటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఎక్కడైనా వైద్యులు ఒక సూచన చేసిన తర్వాత.. డబ్బులు లేని వేళలో మాత్రం.. వెంటనే సర్జరీ అవసరమా? లేదంటే కాస్తంత ఆగి చేయించుకోవటమా? అని అడగటం చూస్తాం. కానీ.. ఒక ప్రముఖుడు.. ఒక రాష్ట్రానికి సీఎంగా పద్నాలుగున్నరేళ్లు పని చేసిన ప్రముఖుడి ఆరోగ్యం విషయంలో.. ‘అవసరమా?’ అని అధికారులు అడగటం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న.