వంద మంది పోలీసులను వెంటేసుకుని టెర్రరిస్టును బంధించిన స్థాయిలో ధూళిపాళ్ల నరేంద్రను జగన్ గవర్నమెంట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాాాగా ఆయనకు బెయిలు లభించింది. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కూడా బెయిలు దక్కింది. వారిద్దరు ఇపుడు విడుదల కానున్నారు.
సంగం డెయిరీ కేసులో నెల రోజుల క్రితం పోలీసులు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణ, సహకారశాఖ మాజీ అధికారి గురునాథాన్ని అరెస్ట్ చేశారు. ఈ రోజు నరేంద్రతో పాటు గోపాల్కృష్ణన్ విడుదలవుతున్నారు.
4 వారాల పాటు విజయవాడ మునిసిపల్ పరిధిలోనే ఉండాలని, ఎక్కడికి వెళ్లకూడదని షరతు విధించి కోర్టు బెయిలు ఇచ్చింది. విచారణకు 24 గంటల ముందు విచారణ అధికారి నోటీసు ఇవ్వాలని అధికారులకు సూచిస్తూ…. విచారణకు సహకరించాలని నరేంద్రను కోర్టు ఆదేశించింది.
ఎటువంటి అవకతవకలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. నరేంద్ర ఇన్ని రోజులు రాజమహేంద్ర వరం జైలులో ఉన్నారు. జైల్లోనే ఆయనకు కరోనా కూడా సోకింది. కరోనా సోకడంతో విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు.