టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్ లో కొనసాగుతుండడంతో మహీ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ధోనీని తమిళ తంబీలు ‘తలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే, కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడం..కేవలం ఆటగాడిగానే కొనసాగుతుండడంతో ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. అయితే, అనూహ్యంగా మరోసారి ధోనీ కెప్టెన్సీ చూసే ఛాన్స్ ధోనీ, సీఎస్ కే అభిమానులకు వచ్చింది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో ఈ సీజన్ లో మిగతా మ్యాచ్ లకు ‘తలా’ ధోనీ కెప్టెన్ గా వ్యవహరించనున్నారని జట్టు యాజమాన్యం తాజాగా ప్రకటించింది. మణికట్టు గాయం కారణంగా ఈ సీజన్ నుంచి గైక్వాడ్ తప్పుకున్నారు. దీంతో, ధోనీకి జట్టు పగ్గాలు అప్పగించింది యాజమాన్యం. ఈ సీజన్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో చివర వచ్చి మెరుపులు మెరిపిస్తున్న ధోనీపై ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.
ఆర్డర్ లో ఇంకొంచెం ముందు వచ్చి బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్న ధోనీ లేటుగా ఎందుకు వస్తున్నాడంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇటువంటి తరుణంలో ధోనీకి కెప్టెన్సీ రావడంతో ఫ్యాన్స్ కాస్త చల్లబడ్డారు. ధోనీ సారథ్యంలో సీఎస్ కే మిగతా మ్యాచ్ లన్నీ గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంటుందని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఈ సీజన్ లో పేలవమైన ప్రదర్శనతో సీఎస్ కే అభిమానులు నిరాశతో ఉన్నారు. జట్టుకు ఎన్నోసార్లు కప్ అందించిన ధోనీ కెప్టెన్ కావడంతో వారికి ఈసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ పై ఆశలు చిగురించాయి.