జగన్ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ లు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ ల పరిస్థితి ముందునుయ్యి..వెనుక గొయ్యి అన్న చందంగా తయారయిందని టాక్ ఉంది. జగన్ చెప్పినట్టు వినకపోతే ఒకతంటా ఒకవేళ ఆయన చెప్పినట్టు చేస్తే కోర్టులతో మరో తంటలా పరిస్థితి తయారైందని ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
జగన్ చలవ వల్ల గతంలో ఏపీ డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ నాలుగు సార్లు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సవాంగ్ నుంచి డిజిపిగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఆ పరంపర కొనసాగిస్తున్నట్టు కనిపిస్తుంది. రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేస్తున్నారన్న ఆరోపణలతో మిల్లర్ల వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారన్న కేసులో రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.
రేషన్ బియ్యం అక్రమ తరలింపు పేరుతో రైస్ మిల్లర్లు, వాహనదారులను పోలీసులు వేధిస్తున్నారని కర్నూలు జిల్లాకు చెందిన సౌదామిని రైస్ మిల్లు యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 5 వాహనాలను సీజ్ చేశారని, ఆ కేసు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లలేదని యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు దిగుతున్నట్టుగా కనిపిస్తుందని ఆ ఫిర్యాదులో పేర్కొంది.
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించలేదని, ఈ కేసు గత వాయిదా సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కోర్టుకు హాజరు కావాల్సిందిగా రాజేంద్ర నాథ్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కోర్టుకు హాజరయ్యారు. కింది స్థాయి పోలీసు అధికారులు కోర్టు ఆదేశాలు పాటించకపోవడం వల్లే డీజీపీని కోర్టుకు పిలిపించాల్సి వచ్చిందని న్యాయమూర్తి తెలిపారు.
ఇలాగైతే పోలీసు శాఖలో క్రమశిక్షణ ఎలా ఉంటుందని, అందుకే కోర్టులో కేసులు నిలబడడం లేదని కోర్టు అభిప్రాయపడింది. స్వాధీనం చేసుకున్న వాహనాలను విడుదల చేయాలని జేసీకి ఆదేశాలు ఇచ్చామని, ఆ ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు డిజిపి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేశామని వెల్లడించారు. అయితే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అని కోర్టు ప్రశ్నించింది.