ఏపీలో చెత్త పన్ను మొదలు విద్యుత్ చార్జీల వరకు జగన్ వీర బాదుడుకు జనం బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. జనం నడ్డి విరిచేలా జగన్ నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలను పెంచుకుంటూ పోతున్నారని విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక, ఇసుక, మద్యం వంటి వాటితో జరిగే దోపిడీ దీనికి అదనమని, జగన్ విధానాలతో ప్రతి కుటుంబంపై ఏడాదికి హీనపక్షం రూ.1 లక్ష భారం పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు గణాంకాలతో సహా గతంలో విశ్లేషించారు.
జగన్ బాదుడేబాదుడుతో ప్రజలు విలవిలలాడిపోతున్నారని, జగన్ చేసే అప్పుల కోసం జనం జేబులకు చిల్లుపడుతోందని మండిపడ్డారు. పథకాల పేరుతో ప్రజల నుంచి పిండిన దాంట్లో 10 శాతాన్ని ప్రజలకు ఇచ్చి మిగిలిన 90 శాతాన్ని జగన్ తన జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఇక, జగన్ అప్పులు…వాటికోసం పడుతున్న తిప్పలపై కాగ్ మొదలు జాతీయ మీడియా వరకు అన్ని వార్నింగ్ ఇచ్చాయి. అయినా సరే జగన్ అప్పుల దాహం తీరడం లేదు. దీంతో, ప్రభుత్వ శాఖల్లో అవకాశమున్న చోట…నిధులను దారి మళ్లిస్తూ పబ్బం గడుపుకుంటోంది ప్రభుత్వం.
ఈ నేపథ్యంలోనే చివరికి పిల్లల సొమ్ములూ వదిలి పెట్టలేదు. పాఠశాలల నిర్వహణ కోసం గత మార్చిలో ఇచ్చిన కాంపోజిట్ గ్రాంట్లనూ జగన్ సర్కార్ వెనక్కి తీసేసుకుంది. పీడీ ఖాతాలు క్లోజ్ చేస్తున్నామనే పేరుతో నగదు మళ్లించి వేరే ఖాతాల్లో ఆ నగదు జమ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ బడులు పునఃప్రారంభమవుతున్నా ఆ నిధులను పాఠశాలలకు ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఆ కథనంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. అప్పులు చేయడం, పన్నుల బాదుడు, నిధులు మళ్లించడం తప్ప ఈ 37 నెలల్లో మీరు ఏం చేశారు? అంటూ జగన్ ను ఉమ నిలదీశారు. పాఠశాలల కాంపోజిట్ గ్రాంట్ ఖాతాలు ఖాళీ చేయడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఉమ ఎద్దేవా చేశారు. టాయిలెట్ల నిర్వహణ పేరుతో అమ్మ ఒడిలో కోత పెట్టిన రూ.879 కోట్లూ మాయం అయ్యాయని ఆరోపించారు.
Comments 1