ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా జల్ జీవన్ మిషన్ అమలు విషయంలో గత వైసీపీ ప్రభుత్వంపై ఘాటుగా సెటైర్స్ పేల్చారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందించడానికి జల్ జీవన్ మిషన్ లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఈ మిషన్ ను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.
ప్రతి మనిషికి రోజుకు సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు ఇవ్వాలనేది ప్రధాని మోదీ కలని.. ఆ కలను నిజం చేసేలా కార్యాచరణ రూపొందించామని అన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ కింద 4000 కోట్లు ఖర్చుపెట్టాం అంటున్నారు., కానీ తాను ఏ జిల్లా కి వెళ్ళినా నీళ్ళు రావట్లేదు అనే ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా గత వైసీపీ ప్రభుత్వం పని చేసిందని.. పైపులు వేసి నీటిని మరిచిపోయిందని సెటైర్లు వేశారు. రిజర్వాయర్ల ద్వారా నీటిని తీసుకోవాల్సి ఉండగా.. ఈ విషయాన్ని వదిలేసి పైపులు మాత్రం వేశారు. రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం చేశారు అంటూ వైసీపీపై పవన్ విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ నీటి సరఫరాపై సారించిందని..జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. జల జీవన్ మిషన్ పూర్తి స్థాయి అమలుకు మన రాష్ట్రానికి రూ.76 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని పవన్ పేర్కొన్నారు. అమృత ధార కింద ఈ స్కీమ్ ను అమలు చేసి ప్రతి వ్యక్తికి మంచినీటిని అందిస్తామన్నారు.