నీతికి.. న్యాయానికి ప్రతిరూపమేరా పోలీస్ అనే మాటలు అందరు పోలీసులకు వర్తించవు. కఠినంగా అనిపించినా ఇది నిజం. నిజాయితీగా వ్యవహరించే పోలీసులు తక్కువగా ఉంటారు. ఏ మాత్రం అవకాశం చిక్కినా.. భారీగా వసూళ్లకు దిగే అధికారులకు లోటు లేదు. తాజా ఉదంతం ఇలాంటి విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తుందని చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక చోరీ జరిగింది. బాధితుడు ఇచ్చిన కంప్లైంట్ లో దొంగ ఎరుపు రీములున్న పసుపురంగు మోపెడ్ మీద పరారీ అయినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. పసుపురంగు మోపెడ్ కోసం తెగ వెతికిన పోలీసులు చివరకు నందా అనే యువకుడ్ని అరెస్టు చేశారు. దీనికి కారణం అతడి వద్ద ఉన్న ఎర్ర రీములున్న పసుపు మోపెడ్ కావటమే. అయితే.. ఆ మోపెన్ అతడిది కాదు.
అతడి చెల్లెలిది. తనకు.. ఆ దొంగతనానికి ఏ మాత్రం సంబంధం లేదని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. బెయిల్ కోసం రూ.50వేలు లంచం ఇవ్వాలని బేరాలాడారు. అరెస్టు చేసిన వ్యక్తిని పోలీసులు కోర్టుకు హాజరు పరిచారు. విచారణలో భాగంగా తనకు ఎదురైన అనుభవాల్ని బాధితుడు ఏకరువు పెట్టటంతో ఆశ్చర్యానికి గురైన సదరు న్యాయాధికారి.. లంచం కోసం డిమాండ్ చేయటంపై సీరియస్ అయ్యారు. అంతేకాదు.. తప్పుడు కేసు పెట్టిన ఎస్ హెచ్ వో.. దర్యాప్తు అధికారి.. లంచం డిమాండ్ చేసిన ఏఎస్ఐ పై చర్యలు తీసుుకోవాలన్న ఆదేశాలు జారీ చేశారు. తాజా ఉదంతం షాకింగ్ గా మారటమేకాదు..పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరన్న విషయం మరోసారి రుజువైంది.