ఢిల్లీ హైకోర్టుకు కోపం వచ్చింది. అది కూడా అలాంటి ఇలాంటి తరహాలో కాదు. తప్పుడు మార్గాల్లో పయనిస్తూ.. పలువురికి ఆర్థికంగా ఇబ్బందులు కలిగించటంతో పాటు.. నీతిబాహ్యమైన పనులతో చేస్తున్న రచ్చపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా.. పూర్తిగా అక్రమ పద్దతుల్లో వ్యవహరిస్తున్న కొన్ని తప్పుడు వెబ్ సైట్ల మీద మండిపడింది. అంతేకాదు.. ఆ తరహా రోగ్ వెబ్ సైట్ లను అణిచివేయాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ వారం విడుదల అవుతున్న బ్రహ్మస్త్ర మూవీకి సంబంధించిన పైరసీ మూవీ అప్పుడే కొన్ని వెబ్ సైట్లలో స్ట్రీమింగ్ అవుతోంది. భారీ బడ్జెట్ తో దాదాపు ఐదేళ్లుగా ఈ మూవీని చెక్కుతున్నారు. ఎట్టకేలకు ఈ మూవీని ఈ శుక్రవారం విడుదల చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందే కొన్ని వెబ్ సైట్లలో ఈ మూవీని పైరసీ రూపంలో స్ట్రీమింగ్ చేస్తున్న వైనంపై చిత్ర నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ అనైతిక స్ట్రీమింగ్ తో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లుగా చిత్ర సహ నిర్మాతలైన స్టార్ ఇండియా కోర్టును కోరింది. దీనికి స్పందించిన జస్టిస్ జ్యోతిసింగ్ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పద్దెనిమిది వెబ్ సైట్లను ముద్దాయిలుగా చేరుస్తూ.. పైరసీని ప్రోత్సహించే ఈ తరహా సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కాపీరైట్ ఉన్న కంటెంట్ ను ప్రదర్శించినా.. అందుబాటులో ఉంచినా.. డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించినా.. షేరింగ్ కు అనుమతి ఉన్నా.. అప్ లోడ్ సదుపాయం ఉన్నా.. చట్టాన్ని ఉల్లంఘించటమే అవుతుందని స్పష్టం చేసింది.
ఇలాంటి సైట్లను వెంటనే బ్యాన్ చేయాలని.. ఇంటర్నెట్ ప్రొవైడర్లు వీరికి సేవలు నిలిపివేయాలని పేర్కొంది. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్న సూచన కూడా చేయటం గమనార్హం.
Comments 1