ఏపీలో 2024 ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఆనవాయితీకి భిన్నంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికలకు చాలా నెలల ముందుగానే కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు. ఇక, చంద్రబాబును ఫాలో అవుతున్న జగన్… నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే తొలి నియోజకవర్గంగా కుప్పాన్ని ఎంచుకున్న జగన్ ఏకంగా చంద్రబాబుపై అభ్యర్థిని ప్రకటించి ఆపరేషన్ కుప్పం మొదలుబెట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంలో గెలుపే లక్ష్యంగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమన్న జగన్…కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున 2024 ఎన్నికల్లో బరిలోకి దిగనున్న భరత్ ను గెలిపించాలని కోరారు. అంతేకాదు, భరత్ ను గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ అంటూ చేస్తున్నామన్నారు. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేశానని చెప్పిన జగన్…తాజాగా కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి 65 కోట్ల విలువైన పనులకు నిధులను మంజూరు చేశారు.
అయితే, కుప్పంలో చంద్రబాబును ఓడించం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంలో ఆయన వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కొద్ది నెలల క్రితం జరిగిన స్థానిక- మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించడంతో రాబోయే ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ, అది అంత సులువు కాదు.
కుప్పంలో ఎన్నికలు దాదాపు ఏకపక్షంగా జరుగుతుంటాయి.1962 నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు ప్రజలు టీడీపీకే విజయాన్ని కట్టబెట్టారు. ఇక్కడ జరిగిన 12 ఎన్నికల్లో టీడీపీ ఏడుసార్లు గెలిచింది. 1985లో టీడీపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగిన రంగస్వామినాయుడు ఇక్కడ విజయం సాధించారు. తర్వాత 1989లో చంద్రబాబు తొలిసారి చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లి పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటి నుంచి కుప్పం నుంచి చంద్రబాబు అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు.
కుప్పంలో దాదాపు 2 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు లక్ష 5 వేలు కాగా.. మహిళలు లక్షా 3 వేలు ఉన్నారు. ఓటర్లలో ప్రధానంగా అగ్రవర్ణాలతో పాటు దాదాపు లక్ష మంది బీసీ ఓటర్లు కూడా ఉన్నారు. వీరంతా కొన్నేళ్లుగా టీడీపీకి అండగా ఉన్నారు. అందుకే టీడీపీ అధినేత ఇక్కడ వరుసగా విజయాలు అందుకుంటున్నారు. వ్యవసాయం, గ్రానైట్ క్వారీలపై ఆధారపడిన కుప్పం ప్రజలకు చంద్రబాబు రెండు దశాబ్దాలుగా ఆశాదీపంలా ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్ధే ఆయన వరుస విజయాలకు కారణం.
కుప్పంలో చంద్రబాబు ప్రచారం చేయకపోయినా కొన్నేళ్లుగా ఆయన్నే వారు గెలిపిస్తూ వస్తున్నారంటే ఇది టీడీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అటువంటి కంచుకోటను జగన్, భరత్ లు బద్దలు కొడతామని చెప్పడం హాస్యాస్పదం. అయితే, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదన్న సూత్రాన్ని నమ్మే చంద్రబాబు ఈ సారి కుప్పంలో భారీ మెజారిటీ సాధించేందుకు కచ్చితంగా గట్టి ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహం లేదు.