విజయవాడ ఎంపీ.. ఇటీవల టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకొన్న కేశినేని నానిపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “కేశినేని నాని ఓ అప్పుల అప్పారావు. ఆయన దివాలా తీసే పరిస్థితికి చేరుకు న్నాడు. ఆయనకు వైసీపీ టికెట్ కూడా ఇవ్వదు“ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని అతి పెద్ద బ్యాంక్ స్కామర్ అని.. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేశారని ఆరోపించారు.
“కేశినేని నాని అప్పుల అప్పారావు, బిల్డప్ బాబాయ్. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం నానికి అలవాటు. కేసుల భయంతోనే తన ట్రావెల్స్ సంస్థను మూసేశాడు. నాని పేరుతో ఉన్న హోటల్ సహా ఆయన ఆస్తులు ఎన్పీఏ(దివాలా) స్టేజీలో ఉన్నాయి“ అని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని నాని ఆస్తుల విలువ రూ. 37 కోట్లు.. అప్పులు రూ. 66 కోట్లు అని బొండా తెలిపారు. 2019 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని ఆస్తుల విలువ రూ. 66 కోట్లు.. అప్పులు రూ. 51 కోట్లుగా ఉన్నాయని చెప్పారు.
2019 ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం 2014లోని ఆస్తులతో పోల్చుకుంటే కేశినేని నాని ఆస్తులు 100 శాతం మేర పెరిగాయన్నారు. 2014 కంటే 2019లో అప్పులూ తగ్గాయన్నారు. అంటే 2014-19 మధ్య కాలంలో ఆయన ఆస్తులు పెరిగి అప్పులు తగ్గాయని, రూ. 2 వేల కోట్ల ఆస్తులను కేశినేని నాని ఎప్పుడు అమ్ముకున్నాడని నిలదీశారు. ”ఆంధ్రా అంబానీ అని చెప్పుకుంటూ కేశినేని నాని టీడీపీలో చేరి.. ఎంపీ టికెట్ తీసుకున్నాడు. కేశినేని నానికి టిక్కెట్ ఇప్పించడంలో సుజనా చౌదరి పాత్ర ఉంది. సుజనానే చంద్రబాబుకు నచ్చచెప్పి టికెట్ ఇప్పించారు.“ అని బొండా గత సంగతులను వెల్లడించారు.
ఇప్పుడు టికెట్ కూడా రాదు!
వైసీపీ సభలకు జనాన్ని సప్లై చేసే స్థాయికి కేశినేని నాని దిగజారిపోయాడని బొండా ఉమా వ్యాఖ్యానించారు. వైసీపీలో ఆయనకు ఎంపీ టిక్కెట్ లేదన్నారు. అన్నం పెట్టిన ఇంటికి కేశినేని నాని సున్నం పూసే రకమని విమర్శించారు. ఇవాళ చంద్రబాబును ఎంతలా విమర్శిస్తున్నారో.. జగన్ను కూడా అదే స్థాయిలో రేపు విమర్శిస్తాడని వ్యాఖ్యానించారు.