సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వంపై కక్ష సాధింపుతో చేపట్టిన పలు చర్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వేలాదిమంది రైతుల త్యాగాలతో ఆంధ్రుల రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిపై కక్ష గట్టిన జగన్…అధికార వికేంద్రీకరణ అంటూ 3 రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే అమరావతి రాజధాని తరలింపు సీఆర్డీఏ రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ చట్టాలపై హైకోర్టులో దాదాపు 90 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ క్రమంలోనే తాజాగా నేటి ఆ పిటీషన్లపై త్రిసభ్య ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగించనుంది. నూతన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ఆధ్వర్యంలోని త్రిసభ్య బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది. గతంలో కోవిడ్ నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతుల్లో కేసుల విచారణ సాగుతోంది.
ఆగస్టులో విచారణ జరిపిన ధర్మాసనం ఆ పిటిషన్ల విచారణ నేటికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేటి నుంచి ప్రతి రోజు విచారణ జరగనుంది.
జనవరిలో సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణపై మొదటిసారి జస్టిస్ జేకే మహేశ్వరీ ఆధ్వర్యంలో త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేశారు. ఆ బెంచ్ ముందు ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. జస్టిస్ జేకే మహేశ్వరీ ఈ ఏడాది జనవరిలో బదిలీ అయ్యారు. దీంతో, విచారణ నిలిచిపోయింది. ఆ తర్వాత హైకోర్టు సీజేగా వచ్చిన అరూప్ కుమార్ గోస్వామి ఆగస్టు 13న వీటిపై విచారణ జరిపి నవంబర్ 15కు తదుపరి విచారణ వాయిదా వేశారు.
ఈ క్రమంలోనే తాజాగా నూతన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య బెంచ్ నేటి నుంచి రోజువారీ విచారణ ప్రారంభించనుంది. అంతకుముందు, ఈ పిటిషన్లపై విచారణ జరిగిన తర్వాత అనుబంధ పిటిషన్లను ధర్మాసనం కొట్టేసిన సంగతి తెలిసిందే. అంశాల వారీగా పిటిషన్లను విచారణ జరిపారు. తాజా విచారణ సందర్భంగా కూడా ఇదే పద్ధతిని అనుసరించే అవకాశముందని తెలుస్తోంది. ఈ రోజు రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే, రాజధాని కేసుల నుంచి న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి, సోమయాజులను తప్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే పిటిషన్ వేశారు. రాజధానిలో ఆ ఇద్దరు న్యాయమూర్తులకు భూములున్నాయని.. వారిని ధర్మాసనం తప్పించాలని కోరారు. ఈ క్రమంలోనే గతంలో ఇవే పిటిషన్లపై విచారణ చేపడుతోన్నప్పుడు వారిపై అభ్యంతరం ఎందుకు తెలపలేదని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయమూర్తులపై ప్రభుత్వ అభ్యంతర పిటిషన్ను కొట్టివేసింది. అమరావతి రాజధాని కేసులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని, దీంతో, రాజధాని రైతులు…ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే, రాజధాని కేసుల విచారణను సత్వరం చేస్తామని హైకోర్టు చెప్పింది.