`ప్రపంచ చరిత్ర` పేరిట మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు విశాఖలోని గీతం వర్సిటీ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత బహిరంగ వేదికపై తోడల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి కలిసి కనిపించారు. ఇరువురు స్టేజ్‌పై ఆత్మీయ ఆలింగనం చేసుకుని అందరినీ ఆకర్షించారు.
ఈ సందర్భంగా దగ్గబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబును ఉద్ధేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు, తనకు మధ్య వైరం ఉందని అందరూ అనుకుంటారు.. అదే నిజమే అని దగ్గుబాటి అన్నారు. `నాకు, చంద్రబాబుకు మధ్య వైరం ఉండేది.. కానీ అది గతం. ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు.. గతాన్ని మర్చిపోయి కాలంతో పాటే ముందుకు వెళుతుండాలి.
భవిష్యత్తు అనేది ఆశాజనకంగా ఉండేలా చూసుకోవాలి.. అలాగని నాకేం రాజకీయ కోరికలు లేవు. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలని చంద్రబాబు నిరంతరం చేసే కృషికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను` అని దగ్గబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. అలాగే తాను రచించిన పుస్తకం గురించి మాట్లాడుతూ.. ఈ బుక్ రాయడానికి ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందని, ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేశానని చెప్పుకొచ్చారు.
కాగా, గతంలో చంద్రబాబుతో తలెత్తిన రాజకీయ విభేదాల వల్ల దగ్గబాటి వెంకటేశ్వరరావు టీడీపీ వీడారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన దగ్గుబాటి.. 2019 ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో కలిసి కనిపించడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.