జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైసీపీ నేతలు భూకబ్జాలు, అక్రమ మైనింగ్ లకు పాల్పడున్నారన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తమకు ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ యథేచ్ఛగా అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. విశాఖలో పరిశ్రమల నుంచి చందాలు వసూలు చేయడం మొదలు….భూదందాలు చేయడం వరకు వైసీపీ నేతల అవినీతి తారస్థాయికి చేరిందని విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
ఆ ఆరోపణలకు ఊతమిచ్చేలా తాజాగా వైసీపీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసు స్టేషన్లో జూన్ 21న ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు కావడం సంచలనం రేపింది. ఈ కేసులో ఏ2గా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని చేర్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేతలు ఆర్టీఐ చట్టం ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అధికార పార్టీ ఎంపీపై కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
సర్వేపల్లి రిజర్వాయర్‌లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపారన్న అభియోగాలతో మాగుంటపై కేసు నమోదైంది. ఈ రిజర్వాయర్ నుంచి మట్టి తవ్వి అనుమతులు తీసుకున్న చోటుకు కాకుండా మార్కెట్లోకి తరలించారని మాగుంటపై ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆధారాలతో సహా నిరూపించారు. టీడీపీ ఇచ్చిన ఆధారాలు పరిశీలించిన అధికారులు… 8వేల క్యూబిక్ మీటర్లకు అనుమతిస్తే 18 వేల క్యూబిక్ మీటర్లు తవ్వినట్లు గుర్తించారు.
అయితే, మాగుంట శ్రీనివాసులురెడ్డి గురించి టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం మాగుంటకు తెలిసి ఉండదని, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయన పేరుతో తవ్వకాలకు అనుమతులు తీసుకొని ఉంటారని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. మాగుంటది పెద్ద పారిశ్రామిక కుటుంబం అని, అక్రమంగా సాధారణ మట్టి తవ్వకాలు చేస్తారా లేదా అన్నది ఆలోచించకుండా కేసు పెట్టారని అభిప్రాయపడ్డారు.
ఈ అక్రమ తవ్వకాల వెనుక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. తన దోపిడీ కోసం కాకాణి సొంత పార్టీకి చెందిన ఎంపీనే బలి చేయడానికి సిద్ధపడ్డాడని అన్నారు. మైనింగ్ అనుమతుల కోసం కాకాణి తన అనుచురుడితో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేయించారని ఆరోపించారు. తద్వారా సర్వేపల్లి రిజర్వాయర్ గ్రానైట్ తవ్వకానికి అక్రమ రీతిలో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.