ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది గడువున్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్నికల సందడి మొదలైందని చెప్పవచ్చు. ముఖ్యంగా వైసిపిని మినహాయిస్తే ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. జనసేనతో టిడిపి పొత్తు దాదాపు ఖాయం అనుకుంటున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ పొత్తు పొడుస్తుందో లేదో అన్న సందేహాలు కలిగేలా చేశాయి.
మరోవైపు జనసేనతో బిజెపి మిత్రబంధం కొనసాగుతుందని, రాబోయే ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పనిచేస్తాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతున్నారు. దీంతో, ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి లలో ఏ పార్టీ ఏ పార్టీతో పెట్టుకుంటుంది అన్న అంశంపై సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పొత్తుపొడుపుల్లో కొత్త పార్టీ ఎంటర్ అయింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పొత్తు కుదిరితే ఓట్లతోపాటు సీట్లు కూడా ఇవ్వాలని నారాయణ అంటున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన నారాయణ…సీఎం జగన్ పై కూడా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల మేలుకోరి తమ పార్టీ ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరించే గుణం జగన్ కు లేవని నారాయణ దుయ్యబట్టారు. పోలవరంపై పోరాడేందుకు జగన్ సర్కార్ కు భయంగా ఉంటే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లాలని నారాయణ సూచించారు.
ఇక, విభజన హామీలు తాము సాధించుకు వస్తామని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. జగన్ ను వీరుడు సూరుడు అనుకున్నామని, కానీ కేంద్రం వద్ద జగన్ మోకరిల్లుతున్నాడని నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలవరంపై వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న పోరాటపటిమా జగన్ కు లేదని నారాయణ తేల్చి చెప్పారు. రాబోయే కాలంలో తండ్రి వైఎస్ఆర్ సిద్ధాంతాలకు కూడా జగన్ పంగనామాలు పెట్టేలా కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఏదేమైనా తాజాగా నారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చకు తెరలేపాయి.