భయంతో వణికేలా చేసి బిక్కుబిక్కుమంటు గడిపిన రోజులకు చెక్ పెట్టే టీకా వచ్చేస్తుంది. త్వరలో ఈ టీకా అందుబాటులోకి రానుంది తొలుత ఆరోగ్య కార్యకర్తలకు.. సిబ్బందికి టీకాను అందించినా.. క్రమపద్ధతిలో అందరికి అందించనున్నారు. మరి.. ఈ టీకాలో డోసు ఎంత ఉంటుంది? అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం వచ్చింది. ప్రస్తుతం అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. మనకు వచ్చే టీకాను రెండు డోసుల్లో వేసుకోవాలి. మొదటి టీకాను వేసుకున్న 28వ రోజున రెండో టీకాను వేసుకోవాల్సి ఉంటుంది.
ఇక.. టీకా డోసు ఎంత? అన్నది చూస్తే.. 0.5 మిల్లీ లీటర్లుగా అధికారులు చెబుతున్నారు. మొదటి డోసు.. రెండో డోసు సమానంగానే ఇస్తారు. అంటే.. మొత్తం డోసు 1 మిల్లీ లీటరు అన్న మాట. ద్రవరూపంలో ఉండే టీకాను ఇంజెక్షన్ ద్వారా ఇచ్చారు. ఈ టీకాను 2నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. అత్యంత శుభ్రమైన.. సురక్షితమైన ప్రాంతంలో భద్రపరిచి ఇస్తారు.
మరి.. టీకా వేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్టులు వస్తే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందుకోసం ప్రభుత్వం ఏమేం ఏర్పాట్లు చేస్తోంది? అన్న వివరాల్లోకి వెళితే.. టీకాలు వేసే ప్రతి కేంద్రంలోనూ సైడ్ ఎఫెక్టులకు చెక్ పెట్టేందుకు వీలుగా 14 రకాల మందుల కిట్ ను ఏర్పాటు చేస్తున్నారు. సైడ్ ఎఫెక్టులు వస్తే.. ఎలాంటివి వస్తాయి? అన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం సిద్ధంగా ఉంది.
టీకా వేసిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్టులు మూడు రకాలుగా అంచనా వేస్తున్నారు. అందులో మొదటిది.. నొప్పి.. వాపు.. జ్వరం రావటం.. రెండోది.. గుండె వేగంగా కొట్టుకోవటం.. బీపీ పడిపోవటం.. ఆయాసం లాంటివి రావటం.. మూడోది.. అన్నట్లుండి పరిస్థితి విషమించటం.. అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి రావటం. ఈ ఇబ్బందుల్ని అధిగమించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడో సమస్య ఎదురైతే తక్షణమే పెద్ద ఆసుపత్రికి తరలించటానికి వీలుగా.. అంబులెన్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. సో.. టీకా కార్యక్రమానికి అన్ని జాగ్రత్తలతో పాటు.. ముందస్తు ఏర్పాట్లు కూడా పక్కాగా జరుగుతున్నాయని చెప్పక తప్పదు.