కరోనా కట్టడి చేయడంలో సరిలేరు నీకెవ్వరు అంటూ సీఎం జగన్ ను వైసీపీ నేతలు ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. కరోనాతో కాపురం చేయాల్సిందేనని దేశంలో మొట్టమొదట చెప్పిన వ్యక్తి జగనన్నే అని, ఆ తర్వాతే ప్రధాని మోదీ ఈ విషయాన్ని చెప్పి క్రెడిట్ కొట్టేశారని వైసీపీ నేతలు వాపోతుంటారు. ఇక, వ్యాక్సినేషన్ విషయంలోనూ ఏపీ టాప్ అని, వ్యాక్సినేషన్ డ్రైవ్ తో రికార్డు క్రియేట్ చేశామని గొప్పలు చెబుతుంటారు. కానీ, కరోనాపై వైసీపీ నేతల మాటలు కోటలు దాటుతుంటే…వాస్తవాలు, గణాంకాలు మాత్రం గడప కూడా దాటడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీలో వ్యాక్సిన్ కోసం ఎదురు చూపులు, పడిగాపులు కాయాల్సిన పరిస్థితికి జగన్ వైఫల్యమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి.
కరోనా నియంత్రణలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది. కొవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో గానీ, చికిత్స విషయంలో గానీ చాలా రాష్ట్రాలతో పోల్చితే దాని పనితీరు దారుణంగా ఉంది. కేంద్రం నుంచి సరిపడా వ్యాక్సిన్లు తీసుకురావడంలో విఫలమై.. టీకా కేంద్రాలను మూసివేసిన జగన్ సర్కారు.. రికార్డు కోసం రాష్ట్రంలో జూన్ నెలలో ఐదు రోజులపాటు కరోనా వ్యాక్సిన్లు వేయడం నిలిపివేసింది.
ఆ తర్వాత జూన్ 20న మెగా వ్యాక్సినేషన్ పేరిట నానా హడావుడి చేసింది. టీకా కేంద్రాల వద్దకు వందలాది మందిని తరలించింది. కరోనా మార్గదర్శకాలన్నిటినీ తుంగలో తొక్కింది. చాలా చోట్ల వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఈ జాతర జరిగింది. ఎవరూ మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు. చాలామందిని బలవంతంగా వ్యాక్సిన్ కేంద్రాలకు తీసుకువచ్చి రికార్డు క్రియేట్ చేశారు.
ఒకేరోజు 13 లక్షల వ్యాక్సిన్ డోసులు వేశామని.. రాష్ట్రప్రభుత్వ సామర్థ్యాన్ని దేశానికి చాటామని సీఎం జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకొన్నారు. ఐదు రోజులు వ్యాక్సిన్ ఇవ్వడం ఆపేసి ఒక రోజు అన్నీ కలిపి వేయడం ఏం ఘనతో అర్థం కావడం లేదు. జూన్ 16వ తేదీన రాష్ట్రంలో కేవలం 30 వేల మందికి వ్యాక్సిన్లు వేస్తే.. మహారాష్ట్ర, గుజరాత్ 2 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 3.70 లక్షల డోసులు వేశారు. 17న ఏపీలో 20 వేల మందికి వ్యాక్సిన్ వేస్తే యూపీలో 4 లక్షలు, రాజస్థాన్‌లో 3.5 లక్షలు వేశారు. వీటన్నిటికీ మసిపూసిన ప్రభుత్వం.. ప్రజలకు ఇవేమీ తెలియవని భావిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రభుత్వం ఇంత హడావుడి చేస్తున్నా రాష్ట్రంలో ఇప్పటికీ 74 శాతం మంది ప్రజలకు ఒక్క డోసు కూడా వేయలేదు. 84 లక్షల మంది ఇంకా రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. అయినా ‘మన రికారు ను మనమే తిరగరాసేలా దేశంలోనే గర్వించదగ్గ స్థాయిలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు’ అని వైద్యఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అభినందించడం గమనార్హం.
అంతర్గత ఫైళ్లలో అసలు సమాచారం
కరోనా కేసులు, మరణాలపై ప్రభుత్వం ప్రజల కోసం చెబుతున్న లెక్కలు వేరు! ‘అధికారిక’ వాస్తవాలు వేరు! జూన్ 9 నుంచి 22వ తేదీ వరకు నమోదైన మరణాలు, ఆస్పత్రుల్లో చేరికలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని పరిశీలిస్తే.. కాకి లెక్కలు చెబుతోందని స్పష్టమవుతోంది. రోజువారీగా ఆస్పత్రుల్లో కొవిడ్ మరణాలు, అడ్మిషన్లు, డిశ్చార్జిలకు సంబంధించిన గణాంకాలను అధికారులు అంతర్గత విశ్లేషణ, సమీక్ష కోసం సేకరిస్తున్నారు. జూన్ నెల 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సంబంధించిన గణాంకాల గ్రాఫ్ బయటపడింది.
దీని ప్రకారం ఆ 14 రోజుల్లో 2,712 మంది కొవిడ్‌తో మరణించారు. కానీ అధికారిక బులెటిన్‌లో 785 మంది మాత్రమే మరణించినట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవే లెక్కలు సమర్పించారు. అంటే… అసలు సంఖ్యలో నాలుగో వంతు మరణాలను మాత్రమే లెక్కలోకి తీసుకున్నారన్న మాట. ఇంకో విషయం ఏమిటంటే… ఇవి కేవలం ఆస్పత్రుల్లో చోటు చేసుకున్న కొవిడ్ మరణాలు మాత్రమే. హోమ్ ఐసొలేషన్‌లో లేదా బయట లెక్కల్లోకి రాకుండా జరిగిన మరణాలూ మరికొన్ని ఉండొచ్చు.
దేశంలో అనేక రాష్ట్రాలు కరోనా మరణాలను ‘తక్కువ’ చేసి చూపిస్తున్నాయని ఇప్పటికే ఆరోపణలున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఆంధ్రలో దాదాపు 30వేల మందికిపైగా కరోనాతో మరణించినట్లు వైద్య నిపుణుల అంచనా. ప్రభుత్వం మాత్రం మొదటి వేవ్‌లో 7,220 మంది… సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకూ 5,196 మంది మరణించినట్లు లెక్కలు చెబుతోంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండి, కరోనా బారిన పడి మరణిస్తే… వారిని కొవిడ్ మృతులుగా గుర్తించడంలేదు.
గుండెపోటు, కిడ్నీలు దెబ్బతినడం, ఇతర అవయవాలు పనిచేయకపోవడం.. వంటి కారణాలతో మరణించినట్లుగా చూపిస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యలున్న వారు కరోనాతో మరణిస్తే దానిని కొవిడ్ డెతగా నిర్ధారించవద్దని వైద్యులకు ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో వైద్యులు కూడా ఇలాంటి కేసులను గుండెపోటు, బ్రెయిన్ డెత్ గానే పరిగణిస్తూ సాధారణ మరణాలుగా చూపిస్తున్నారు. ఇక కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఈ పరీక్షలు తగ్గించి వైరస్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు చూపిస్తున్నారు. లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ.. మళ్లీ కరోనా సోకేందుకు ఆస్కారం కల్పిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.