అసలు కంటే కొసరు ఎక్కువన్నట్లుగా కొవిడ్ 19 కంటే తీవ్రంగా మారింది డెల్టా వేరియంట్. మన దేశంలో తొలిసారి కనిపించిన బి.1.617.2 వేరియంట్ కు డెల్టా వేరియంట్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు పెట్టటం తెలిసిందే.
ప్రపంచాన్ని ప్రస్తుతం కొవిడ్ 19 కంటే కూడా ఈ కొత్త వేరియంట్ వణికిస్తున్నట్లుగా డబ్ల్యూహెచ్ వో వెల్లడించటం విశేషం. ప్రపంచం మొత్తాన్ని డెల్టా వేరియంట్ ఒక్కటే వణికిస్తోందని వెల్లడించారు.
డెల్టాతో పాటు మరో మూడు వేరియంట్లు ప్రమాదకరంగానే ఉన్నా.. డెల్టాకు మించి మాత్రం కాదని.. కొవిడ్ అసలు వేరియంట్ కంటే కూడా ఈ వేరియంట్ చాలా వేగంగా విస్తురిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
వ్యాక్సిన్లను కూడా ఈ వేరియంట్ బోల్తా కొట్టిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ వేరియంట్ ప్రత్యేకత ఏమంటే.. ఇది ట్రిపుల్ వేరియంట్. దీనికి చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా అధ్యయనాలు చేస్తున్నారు.
ప్రపంచానికి కొత్త వణుకుగా మారిన డెల్టా వేరియంట్ తో చోటు చేసుకుంటున్న తిప్పలు సరిపోనట్లుగా ఇప్పుడు మరో సమస్య తెర మీదకు వచ్చింది. డెల్టా వేరియంట్ తోకూడిన మరో కొత్త హైబ్రిడ్ వేరియంట్ ను వియత్నాంలో గుర్తించారు.
ఇప్పుడా వేరియంట్ ఆ దేశంలో చాలా వేగంగా విస్తరిస్తోంది. కొవిడ్ 19 అసలు వైరస్ కు మించినట్లుగా ఈ మ్యుటెంట్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నట్లుగా చెబుతున్నారు.