ప్రపంచదేశాలతోపాటు భారత్ లోనూ కరోనా కలకలం రేపుతోంది. సెకండ్ వేవ్ లో రూపం మార్చుకున్న వైరస్ …మరింత శక్తిమంతంగా తయారైంది. తాజాగా వ్యాప్తి చెందుతున్న వైరస్ కొమ్ములు మానవ కణజాలం తలుపుల గడియ తీసుకొని బలవంతంగా లోపలికి చొరబడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ వైరస్ తో పోలిస్తే సెకండ్ వేవ్ వైరస్ 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే భారత్ లో కరోనా కేసుల సంఖ్య వారం రోజుల వ్యవధిలోనే వేల నుంచి లక్షల్లోకి చేరుకుంది. వరుసగా ఐదో రోజు కూడా కరోనా కేసుల సంఖ్య 2 లక్షల మార్క్ దాటింది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 2,73,810 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య దాదాపుగా 3 లక్షల మార్క్ టచ్ చేయడం కలవరపెడుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1619 మంది కరోనాబారిన పడి మరణించారు.
తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 1,50,61,919 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 1,29,53,821 మంది కోవిడ్ బాధితులు డిశ్చార్జ్ కాగా…మొత్తం 1,78,769 మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్ లో 19,29,329 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12,38,52,566 మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు. ఇదే ఊపు కొనసాగితే మరో 2 వారాల్లో రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.