టీడీపీ కార్యకర్తలంటే క్రమశిక్షణకు మారు పేరని గతంలో ఎన్నో సందర్భాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు గుర్తుచేయడం తెలిసిందే. ఐకమత్యానికి మారుపేరని పదేపదే చెబుతుంటారు. అయితే ఇదంతా గతం… ప్రస్తుతం వరుస ఓటములతో ఆ పార్టీలోని కీలక నేతలనే అనుమానించే పరిస్థితి వచ్చింది.
టీడీపీని కోవర్టులే నాశనం చేస్తున్నారని, పార్టీ రహస్యాలను ప్రత్యర్థి వర్గానికి చేరవేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వంలోనే కోవర్టులున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీడీపీ ఘోర ఓటమిని చెవిచూసింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీ అపజయాన్ని మూటకట్టుకుంది. ఈ ఓటమిని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కార్యకర్తలే ఇలా ఉంటే.. ఇక చంద్రబాబు ఎలాంటి పరిస్థితిలో ఉంటారే చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓటమికి గల కారణాలను అన్వేషించే పనిలో భాగంగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.
కుప్పం టీడీపీ శ్రేణులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కుప్పం మున్సిపల్ ఎన్నికలు, నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతల తీరుపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఏకంగా రాష్ట్ర స్థాయి నాయకత్వంలోనే కోవర్టులున్నారని ప్రకటించారు. త్వరలో పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తామని హెచ్చరించారు. ఈ పనిని కుప్పం నుంచే మొదలు పెడుతామని స్పష్టం చేశారు.
ఈ భేటీలో స్థానిక నేతలు.. అధినేతకు పలు సూచనలు చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అధికార పార్టీ అరాచకాలతో పాటు సొంత పార్టీలో నేతల తప్పిదాలను వివరించారు. కుప్పం నాయకత్వంలో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు.
త్వరలోనే ఈ సూచనలను అమల్లోకి తెస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తనను మెప్పించడం కాదని, ప్రజా క్షేత్రంలో పనిచేసే వారికే గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు. కుప్పం నేతల అతి విశ్వాసం వల్లే ఇక్కడ ఓడిపోయామని చంద్రబాబు తెలిపారు. కుప్పంలోనే ఇల్లు కట్టుకుని, పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించాలని కార్యకర్తలు సూచించారు. కార్యకర్తల సూచనలపై అధినేత స్పందించారు. ఇక నుంచి తరుచూ కుప్పంలో పర్యటిస్తానని, కార్యకర్తలు, నేతలకు ఎక్కవ సమయం కేటాయిస్తానన్నారు. కుప్పంలో సొంత ఇల్లు నిర్మిస్తానని, ఎక్కువ సమయం కేటాయిస్తానని చంద్రబాబు తెలిపారు.
కుప్పం నియోజకవర్గం టీడీపీ కంచుకోట. ఎప్పడు ఎన్నికలు జరిగినా టీడీపీదే విజయం. అంతలా నియోజకవర్గాన్ని చంద్రబాబు తీర్చిదిద్దారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి తలకిందులైంది. పంచాయతీ, స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వాస్తవానికి అనేక వ్యూహాలు కుట్రలతో వైసీపీ ఇక్కడ గెలిచిందన్నది టీడీపీ ఆరోపణ. దానికి తగినట్టే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు బయటపడ్డాయి.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.