సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళిపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సీఐడీ పోలీసులకు స్థానికంగా అందిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. దీనిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా.. ఆయన కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కులాలు, రాజకీయ వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా పోసాని వ్యాఖ్యానించారని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనను విచారించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. కోర్డు ఆదేశాలకు అనుగుణంగా గుంటూరు జైలుకు తరలించారు. అయితే.. తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనను మరింత లోతుగా విచారించాల్సిఉందని.. కులాలు, రాజకీయ వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యానించడం వెనుక ఎవరున్నారన్న విషయంపై కూపీ లాగాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు విజయవాడ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు. దీనిని విచారించిన కోర్టు.. పోసానిని కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయనను విచారించాలని కోర్టు తేల్చి చెప్పింది.
అయితే.. విచారణ సమయంలో పోసానిపై థర్డ్ డిగ్రీ చర్యలు తీసుకోవద్దని కోర్టు సూచించింది. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విచారించాలని.. ఒత్తిడి చేయరాదని తెలిపింది. విచారణ సమయంలో న్యాయవాదిని సమీపంలో ఉంచాలని స్పష్టం చేసింది. ఆయన కోరితే.. వైద్య పరీక్షలు చేయించాలని, వైద్యుడిని కూడా దగ్గర ఉంచుకునేందుకు అనుమతించాలని పేర్కొంది. నిబంధనల మేరకు మాత్రమే విచారించాలని.. కేసు పరిధిని దాటి ఎలాంటి విషయాలను ప్రస్తావించరాదని సీఐడీ తరఫు న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఇదిలావుంటే.. ఇప్పటికే తనపై ఒకే కేసుకు సంబంధించి పలు స్టేషన్లలో కేసులు నమోదు చేశారని.. వాటిలో బెయిల్ లభించిందని పోసాని.. కోర్టులో పిటిషన్ వేశారు. సీఐడీ దాఖలు చేసిన కేసులోనూ తనకు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే.. దీనిపై మంగళవారం విచారణ చేపట్టనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.