తెలంగాణలో ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఉండగా.. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు సాగుతూనే ఉంది. ధాన్యాన్ని కొనాల్సింది కేంద్రమే అంటూ టీఆర్ఎస్.. కాదు కేసీఆర్ ప్రభుత్వమే అంటూ బీజేపీ ఓ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయనే చెప్పాలి. అటు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ.. ఇటు రాష్ట్రంలో సర్కారు పార్టీ తమ రాజకీయ లబ్ధి కోసమే ఇలా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయనే వ్యాఖ్యలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇలా రైతులతో రాజకీయం చేస్తున్న ఈ రెండు పార్టీలు బాగానే ఉన్నప్పటికీ మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌కు మాత్రం ఈ విషయం కారణంగా దెబ్బ పడుతుందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.
మీరంటే.. మీరని
కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్‌లో బీజేపీ తరపున ఈటల రాజేందర్ గెలిచారు. దీంతో కేసీఆర్‌లో ఫ్రస్టేషన్ పెరిగిపోయిందని అందుకే ధాన్యం కొనుగోళ్ల విషయంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మండిపడుతున్నారనే టాక్ ఉంది. రాష్ట్రంలో ధాన్యం మొత్తాన్ని కొట్టామని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు కూడా చేశాయి. మరోవైపు కేసీఆర్ కావాలనే రైతులు జీవితాలతో ఆడుకుంటూ ఆ తప్పును కేంద్రం మీదకు తోసేస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ కూడా ఆందోళనలతో రోడ్డెక్కింది. తాజాగా ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జిల్లాల పర్యటనలో ఎంత ఉద్రిక్తతకు దారి తీశాయో తెలిసిందే. బండి సంజయ్ పర్యటన సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి.
కాంగ్రెస్ పేరు ఎక్కడ?
ధాన్యాన్ని కేంద్రం కొనడం లేదంటూ టీఆర్ఎస్.. రాష్ట్రం కొనడం లేదంటూ బీజేపీ రోడ్డెక్కడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రజల దృష్టి ఆ రెండు పార్టీలపైనే కేంద్రీకృతమైంది. రాజకీయాల్లో రెండు పార్టీల మధ్యనే పోటీ ఉందనే భావన వస్తే ప్రజలు మూడో పార్టీని పట్టించుకోవడం మానేస్తారు. దీంతో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా గెలిచే అవకాశం ఉండదని భావిస్తారు. అందుకే ఆ పార్టీకి వెయ్యాల్సిన ఓట్లు కూడా ఇతర పార్టీలకు వేస్తారు. అందుకు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలే నిదర్శనం. అక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లు పోటీ జరిగింది. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను పట్టించుకోలేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ఆ రెండు పార్టీలే కత్తులు దూసుకోవడంతో కాంగ్రెస్ పేరు ఎక్కడా వినిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇంకా ఆ గొడవలోనే..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దారుణమైన ప్రదర్శన ఇంకా ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది. మరీ ఘోరంగా కేవలం 3 వేల ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్ కోల్పోవడంతో సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మరోసారి పార్టీలో అంతర్గత విభేదాలు చెలరేగాయి. ఈ ఫలితాన్ని తీవ్రంగా పరిగణించి అధిష్ఠానం రాష్ట్ర నాయకులను ఢిల్లీకి పిలిపించి మరీ పంచాయతీ పెట్టింది. కానీ దానివల్ల విభేదాలు మరింత పెరిగాయని సమాచారం. ఈ లోపు ఇటు టీఆర్ఎస్కు దీటుగా సాగుతున్న బీజేపీ ప్రజల్లో మరింత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇక ఇప్పటికైనా కాంగ్రెస్ కళ్లు తెరవకపోతే నష్టం తప్పదు.