ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా రాజకీయాలను మార్చడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పార్టీలను తీర్చిదిద్దడం ఈ రెండూ ఎప్పుడూ చేయాల్సిందే ! ఆ విధంగా రాజకీయం కాస్త రివైజ్డ్ వెర్షన్ లో బాగుంటుంది. అప్ గ్రేడ్ అయితే ఇంకా బాగుంటుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయినా, యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా పార్టీలను రివైజ్డ్ వెర్షన్ లో ఉంచడం మంచిదే ! ఒకప్పుడు బలమయిన నేత అయితే కాదు జగన్ అని అనుకుని వదిలేసిన కాంగ్రెస్ చుక్కలు చూపించారు ఆయన.
ఒకప్పుడు సరైన ప్రత్యర్థి కాదు అని భావించి, కొన్ని అవమానాలు సైతం అనుభవించేలా చేసిన టీడీపీకి కోలుకోలేని దెబ్బ తీశారు ఆయన. ఓ విధంగా ఆ రోజు జగన్ అంటే తిరుగులేని సాహసం అన్నవిధంగా కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన ఎలివేషన్ కూడా బాగానే పనిచేసింది. ఆయన సోనియాను ఢీ కొన్న వైనం పై కొంత వాస్తవాలు కొన్ని అతి ప్రచారాలు వైసీపీ ఆవిర్భావానికి మరియు ఎదుగుదలకు బాగానే ఉపకరించాయి. ఉపయుక్తం అయ్యాయి. ఇవాళ పొలిటికల్ ట్రెండ్స్ మారుతున్న నేపథ్యంలో మళ్లీ వైసీపీ బాస్ కు చెందిన వర్గాలు, మళ్లీ కాంగ్రెస్ ఓ దగ్గరకు చేరుతాయా?
నిజంగానే జగన్ అక్రమాస్తుల కేసులు అంతకుమునుపు పరిణామాలు వీటన్నింటినీ మరోసారి విశ్లేషించే సమయంలోనే ఈ అప్డేట్ వచ్చిందా ? లేదా ఉనికిని కాపాడుకునేందుకు సోనియాకు ఈ ఫార్ములాను ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారా ? ఇవన్నీ కాదనుకుంటే ఓ ప్రధాన స్రవంతి లో ఉన్న మీడియా చేస్తున్న ఎత్తుగడ లాంటిదేమయినా ఉందా ? అన్న అనుమానాలు బాగానే వ్యక్తం అవుతున్నాయి.. ఆ రోజు కాంగ్రెస్ ను ఢీ కొని ఎన్టీఆర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. తరువాత కాంగ్రెస్ కు దగ్గరయి పార్టీ సైద్ధాంతిక భావజాలాన్నే మార్చేశారని చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు కూడా అలాంటిదేదో జరిగితే జగన్ పై కూడా ఈ తరహా విమర్శలే రావొచ్చు అని అంటున్నాయి ఆయన అభిమాన వర్గాలు. అసలు పొత్తులతో మాకు పనేంటి అని ఎన్నోసార్లు చెప్పిన వైసీపీ, సింహం సింగిల్ గానే వస్తుందని రజనీ కాంత్ డైలాగులు చెప్పిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు మాట మార్చరు అనుకోవాలా అని సోషల్ మీడియా చర్చ మొదలుపెట్టింది. ఇవే వారు మాట్లాడుతున్న మాటలు మరియు సంధిస్తున్న ప్రశ్నలు. కనుక పొత్తుల ఊసే లేదు అని వైసీపీ చెప్పే వరకూ ఊహాగానాలు ఉంటూనే ఉంటాయి.