తెలంగాణలో అంతగా బలం లేనప్పటికీ.. కొన్ని జిల్లాల్లో మాత్రం తమ అధిక్యతను ప్రదర్శించే సత్తా కమ్యునిస్టుల సొంతం. పోరాటాల పురిటిగడ్డ మీద ఇప్పుడంటే వామపక్ష పార్టీలకు పెద్దగా బలం లేదు కానీ.. ఉమ్మడి నల్గొండ.. ఖమ్మం జిల్లాల్లో మాత్రం కాస్తంత ఉన్న పరిస్థితి. ఇటీవల కాలంలో వారి బలం అంతకంతకూ తగ్గుతూ వస్తున్నా.. కొన్ని గ్రామాల్లోనూ.. పట్టణాల్లోనూ పాత వాసనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
తమకు పట్టున్న ప్రాంతాల్లో కమ్యునిస్టులు ఎంతలా వ్యవహరిస్తారన్న దానికి నిదర్శనంగా ఈ మధ్యనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని క్రిష్ణయ్య హత్య ఉదంతం తెలిసిందే. కమ్యునిస్టు కోటలో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయటమే ఇతని తప్పైంది. అంతే.. 60 ఏళ్ల వయసున్న అతన్ని అత్యంత దారుణంగా.. పాశవికంగా హత్య చేసే వరకు వదల్లేదు కమ్యునిస్టు నేతలు. తమ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో వేరే పార్టీ ఎంట్రీని కూడా సహించలేని తత్త్వం కమ్యునిస్టుల సొంతం.
అలాంటి కమ్యునిస్టులు అవసరం వస్తే మాత్రం ఎంతకైనా వెనుకాడరు. టీఆర్ఎస్ నేతనుదారుణంగా హతమార్చి.. రాజకీయ కలకలాన్ని రేపిన ఉదంతం ఒక కొలిక్కి రాక ముందే.. కమలనాథుల మీద ఉన్న కోపంతో కేసీఆర్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని సమూలంగా మార్చే శక్తి మునుగోడు ఉప ఎన్నికకు ఉందన్న ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ సీటును ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న కారుపార్టీకి కమ్యునిస్టులు జత కలవాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
మునుగోడు ఉప పోరులో టీఆర్ఎస్ కే మద్దతు ఇవ్వటం ద్వారా కమలం పార్టీకి చెక్ పెట్టాలన్న యోచనలో సీపీఐ.. సీపీఎంలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రెండు పార్టీలకు మునుగోడులో 25 వేలకు పైగా ఓట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఇతర పార్టీల విజయవకాశాల్ని ప్రబావితం చేసే సత్తా తమకు ఉన్న నేపథ్యంలో.. మునుగోడులో కేసీఆర్ కు సాయం అందించటం ద్వారా.. తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో దాని ప్రయోజనాన్ని పొందాలన్నది కమ్యునిస్టుల ఆలోచనగా చెబుతున్నారు.
విచిత్రమైన విషయం ఏమంటే.. కాంగ్రెస్ కు దగ్గరవుతారనుకున్న కమ్యునిస్టులు.. అందుకు భిన్నంగా టీఆర్ఎస్ కు దగ్గర కావటం గమనార్హం. అయితే.. ఇలా ఎందుకు? అన్న దానికి వారు వినిపిస్తున్న వాదనల్ని చూస్తే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరుతున్నందున.. కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలుతాయని.. ఆ పార్టీకి వామపక్షాలు మద్దతు ఇచ్చినా బీజేపీ లాభపడుతుందన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు.
దీనికి తోడు కొంతకాలంగా ప్రధాని మోడీని.. బీజేపీని తీవ్రస్థాయిలో సీఎం కేసీఆర్ దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో.. కారుపార్టీతో కలిసి సాగటం మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మునుగోడు సీటును బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో వారిని దెబ్బ కొట్టే అవకాశాన్ని విడిచి పెట్టకూడదన్న ఆలోచనలో కమ్యునిస్టులు ఉన్నారు. అందుకే ఈసారి టీఆర్ఎస్ తో జత కట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.
మునుగోడు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ కు అండగా నిలవటం ద్వారా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం.. భద్రాచలం.. మిర్యాలగూడ.. ఖమం.. పాలేరు నియోజకవర్గాలు కేటాయించాలన్నది ప్లానింగ్ గా చెబుతున్నారు. మరి.. ఈ విషయంలో కేసీఆర్ నిర్ణయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.