టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు, క్రీడాకారుల పతకాల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. అయితే, తాజాగా నేడు జరిగిన మహిళల హాకీ పోరులో భారత మహిళల జట్టు అద్భుతంగా పోరాడి ఓడింది. గ్రేట్ బ్రిటన్ తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల హాకీ జట్టు 3-4 తేడాతో పరాజయం పాలైంది.
ఈ మ్యాచ్ గెలిచి కనీసం కాంస్యం సాధించి చరిత్ర తిరగరాద్దామనుకున్న మహిళల జట్టుకు పరాభవం ఎదురు కావడంతో కొందరు క్రీడాకారులు కోర్టులోనే భావోద్వేగానికి గురయ్యారు. అయితే, ఈ సందర్భంలో బ్రిటన్ మహిళల జట్టు క్రీడాస్ఫూర్తిని చాటింది. అప్పటి దాకా కోర్టులో ప్రత్యర్థులుగా తలపడ్డ భారత మహిళా క్రీడాకారులను బ్రిటన్ క్రీడాకారులు భుజం తట్టి ఓదార్చడం ఈ మ్యాచ్ కే హైలైట్. ఇక, భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు ప్రధాని మోదీ, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ స్వయంగా ఫోన్ చేసి ఓదార్చారు. భారత్ గర్వించే ప్రదర్శన చేశారని, మ్యాచ్ ఓడినా కోట్లాది మంది మనసులు గెలిచారని, ఆ ప్రదర్శన పట్ల యావత్ దేశ ప్రజలు గర్వపడుతున్నారని అన్నారు.
ఈ రోజు బ్రిటన్ క్రీడా స్ఫూర్తిని కొనియాడుతున్న వారంతా…కజకిస్థాన్ రెజ్లర్ సెనయేవ్ క్రీడాస్ఫూర్తికి తూట్లు పొడవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సెమీ ఫైనల్లో రవి కుమార్ ను కజకిస్థాన్ రెజ్లర్ సెనయేవ్ భుజంపై కొరికి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా నిబంధనలు ఉల్లంఘించాడు. అయితే, ఆ నొప్పిని కూడా భరిస్తూ రవికుమార్ ఫైనల్లో బలమైన ప్రత్యర్థితో తలపడి పోరాడి ఔరా అనిపించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఫైనల్లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా రజత పతకం సాధించి మువ్వన్నెల జెండా ఎగురవేశాడు.
పసిడి పతకం కోసం జరిగిన తుది కుస్తీ పోటీలో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఒసి) జట్టుకు చెందిన జవూర్ ఉగుయేవ్‌తో రవికుమార్ పోరాడి ఓడాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఉగుయేవ్ 7 పాయింట్లు దక్కించుకోగా…రవికుమార్ కు 4 పాయింట్లు దక్కాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్ డాగ్ గా బరిలోకి దిగిన రవి కుమార్ రజత పతకం సాధించడం విశేషం. ఒలింపిక్స్ లో భారత్ తరఫున రెజ్లింగ్ లో ఫైనల్ చేరిన రెండో క్రీడాకారుడిగా రవి కుమార్ చరిత్ర పుటల్లోకెక్కాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో రెజ్లర్ సుశీల్ కుమార్ కూడా రజతం సాధించాడు.
కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు 2 రజతాలు, 3 కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించి పతకాల పట్టికలో 62వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చైనా 33 స్వర్ణాలతో అగ్రస్థానంలో ఉంది. 27 బంగారు పతకాలతో అమెరికా రెండో స్థానంలో కొనసాగుతోంది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు వ్యక్తిగత విభాగంలో 4 పతకాలు వచ్చాయి. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజతం సాధించింది. మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో లవ్లీనా కాంస్య పతకం దక్కించుకుంది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించి తెలుగువారి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసింది. రెజ్లింగ్ లో రవికుమార్ రజతం సాధించాడు. భారత్ పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది.