ఆయనో ముఖ్యమంత్రి. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చారు. ఆ సందర్భంగా ఆయనకు టీ ఇచ్చారు. అది కాస్తా చల్లగా ఉంది. సీఎంకు ఇచ్చే టీ వేడి వేడిగా ఉండాలన్న సోయి లేకుండా వ్యవహరించినందుకు ఉద్యోగులకు భారీ షాకిచ్చిన వైనం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. చల్లారిన టీ ఎలా ఇస్తారంటూ.. అందుకు కారణాన్ని తెలుపుతూ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఇలాంటివి చోటు చేసుకున్నా.. అంతలా చర్చకు తెర తీసేవి కావు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఈ ఇష్యూ రచ్చ రచ్చగా మారటమే కాదు.. అంత చిన్న కారణానికి షోకాజ్ నోటీసు ఇస్తారా? అంటూ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. స్థానిక ఎన్నికల ప్రచారం కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. భోపాల్ నుంచి రేవాకు వెళ్లారు.
మార్గమధ్యలో ఛతర్ పుర్ జిల్లా ఖజురహో ఎయిర్ పోర్టులో కాసేపు ఆగారు. స్వయంగా ముఖ్యమంత్రి వారు వస్తుండటంతో నేతలు.. అధికారులు భారీగా విచ్చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్నాక్స్.. ఇతర ఏర్పాట్లు చూసుకునేందుకు రాకేశ్ అనే ఉద్యోగికి బాధ్యతలు అప్పజెప్పారు. అయితే.. ముఖ్యమంత్రి వారికి అందజేసిన టీ బాగోలేకపోవటంతో పాటు చల్లగా ఉందని పేర్కొంటూ.. వివరణ ఇవ్వాలని చెబుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. అసలు సీఎం ఎయిర్ పోర్టు టెర్మినల్ లోకి కూడా రాకుండానే రన్ వే మీద నుంచే మరో విమానం ఎక్కి వెళ్లిపోయారన్న వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. దీంతో.. ఉన్నతాధికారుల తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. తాము జారీ చేసిన షోకాజ్ నోటీసుల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో.. ఈ వివాదం తాత్కాలికంగా సమిసిపోయింది. సిల్లీ రీజన్ కు షోకాజ్ నోటీసు వరకు వెళ్లిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటివి శివరాజ్ సింగ్ సర్కారుకు సైతం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.