తాను కొడితే బలంగా కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన గులాబీ బాస్ కేసీఆర్ మాటలకు సీఎం రేవంత్ రెడ్డి రియాక్టు అయ్యారు. మౌనంగా.. గంభీరంగా గడిచిన పద్నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్నానని.. రేవంత్ పాలనలో తెలంగాణ ఆగమైందని.. ప్రజలు అత్యాశకు పోయారంటూ వారిపై తనకున్న కోపాన్ని మరోసారి ప్రదర్శించారు కేసీఆర్. గులాబీ బాస్ మాటలకు అంతే తీవ్రంగా రియాక్టు అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్.
‘కేసీఆర్.. మీరు కాలం చెల్లిన రూ,.వెయ్యి నోటు. గతంలో ఆ నోటుకు చాలా విలువ ఉండేది. ఇప్పుడు ఆ నోటు ఉంటే జైలుకు పంపుతున్నారు. ఫామ్ హౌస్ లో ఉండి మీకు ప్రజలతో బంధం తెగిపోయినట్లుంది. జనజీవన స్రవంతిలోకి రండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆర్నెల్లలో 55,143 ఉద్యోగాలిచ్చింది. బీసీ కులగణన.. ఎస్సీ వర్గీకరణ నివేదికల్ని అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నాం. కేసీఆర్.. మీరూ రండి. చర్చించండి.మీరో.. మేమో తేల్చుకుందాం.’ అంటూ సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలలకే రాష్ట్ర పరిస్థితి దిగజారిందా? కొడితే బలంగా కొడతానంటారా? కేసీఆర బలంగా కొట్టటం కాదు.. ముందు సరిగ్గా నిలబడండంటూ (బలంగా కొట్టడమేమోగానీ.. కట్టె లేకుండా నిలబడు చూద్దాం) ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే.. మీరు అధికారం నుంచి దిగిపోయే ముందు రూ.7లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు. రైతుబంధుకు మీరు పదేళ్లలో రూ.18వేల కోట్లు ఇస్తే.. అందులో మిత్తీకే రూ.8వేల కోట్లు పోయాయి. మీరు నికరంగా ఇచ్చింది రూ.3వేల కోట్లే. రైతుబిడ్డగా నేను సరిగ్గా అరవై రోజుల్లో 25.5 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశార. ఎకరాకు రూ.6వేల చొప్పున రైతు భరోసాను మార్చి 31నాటికి అన్ని బ్యాంకుల్లో జమ చేస్తాం’’ అంటూ కీలక ప్రకటన చేశారు.
అదే సమయంలో ఫిబ్రవరి ఆరేడు తేదీల్లో అన్నీ లెక్కల్ని అసెంబ్లీలో పెడతామని.. అక్కడకు రావాలంటూ గులాబీ బాస్ కేసీఆర్ ను సవాలు విసిరారు సీఎం రేవంత్. తాను రైతు భరోసా ఇవ్వలేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ‘‘ఫామ్ హౌస్ లో కూర్చొని మాటలు చెప్పటం కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి. ముందు కొడుకును.. మేనల్లుడ్ని కంట్రోల్ లో పెట్టుకోండి. అచ్చోసిన ఆంబోతుల్లా కొడుకును.. అల్లుడ్ని ప్రజల మీదకు వదిలావ్. వారు జనాల మీద పడి మేస్తున్నరు. వారిని అదుపులోపెట్టుకో. నేను మీలా మాట ఇచ్చి మడమ తిప్పను. హామీలు ఇచ్చి ఎగ్గొట్టను’’ అంటూ విరుచుకుపడ్డారు. మొత్తంగా చూస్తే.. తనపై ఘాటు విమర్శలు చేసిన కేసీఆర కు అంతే ధీటుగా రేవంత్ కౌంటర్ ఇచ్చారని చెప్పాలి.