కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు అంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, మూసీ నది ప్రక్షాళన చేయకుంటే హైదరాబాద్ వరదల సమయంలో మరో చెన్నైని తలపిస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల మాటలను లెక్కచేయకుండా మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారు.
ఈ క్రమంలోనే ఈ రోజు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన రేవంత్ రెడ్డి…మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును అడ్డుకుంటే కేసీఆర్ కుక్క చావు చస్తారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మూసీ ప్రాజెక్టుకు అడ్డుపడితే బుల్డోజర్ తో తొక్కించి ముందుకెళ్తా..ఎవరొస్తారో రండి అంటూ రేవంత్ సవాల్ విసిరారు. మూసీని ప్రక్షాళన చేయకుంటే తన జన్మ దండగ అని, ఈ నది నీరు విషంగా మారిందని, ఇక్కడ పిల్లలు అనారోగ్యంతో పుడుతున్నారని అన్నారు.
మూసీకి కేసీఆర్ అడ్డుపడితే ఆ పాపం తగిలి కుక్క చావు చస్తారని రేవంత్ షాకింగ్ కామెంట్లు చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు జెండా, ఎజెండాలు పక్కన పెట్టి మూసీ ప్రక్షాళనకు సహకరించాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఎవరు అడ్డు వచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదని, ఎవరు అడ్డు వస్తారో రండి చూసుకుందాం అంటూ రేవంత్ సవాల్ విసిరారు.
ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ నల్గొండను పట్టి పీడిస్తోందని, మూసీ నది ఒడ్డున పెంచే గొర్రె మాంసం, కూరగాయలు కొనే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు అణుబాంబు కంటే మూసీ నది ప్రమాదకరని చెప్పారు. హైదరాబాద్ మహానగరానికి వరంగా మారాల్సిన మూసీ నది శాపంగా మారితే బాగుచేయొద్దా అని రేవంత్ ప్రశ్నించారు. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళనకు డిజైన్లు ఖరారు చేస్తామని చెప్పారు.