మామూలుగా అయితే, తరతరాలు తాము కోరుకున్న పదవిలో తామే ఉండాలి అని ప్రతి రాజకీయ నాయకుడు అనుకుంటాడు. టర్మ్ తర్వాత టర్మ్..లాంగ్ టర్మ్ తానే ఆ పదవిలో కొనసాగాలి అనుకుంటాడు. తన తర్వాత తన వారసులు ఆ పదవి దక్కించుకోవాలని కోరుకుంటాడు. అయితే, మంత్రి నారా లోకేశ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఒక వ్యక్తి మూడు టర్మ్ లకు మించి ఏ పదవిలోనూ ఉండకుంటే బాగుంటుందని లోకేశ్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అయితే, ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీ పెద్దలు ఇటువంటి విషయాలపై చర్చిస్తారని చెప్పారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు టర్మ్ లు పూర్తయ్యాయని, నాలుగో టర్మ్ తాను ఆ పదవి చేపట్టకూడదని భావిస్తున్నానని లోకేశ్ అన్నారు. పార్టీలో కొత్తవారికి అవకాశం రావాలని, గ్రామ స్థాయి కార్యకర్త నుంచి పోలిట్ బ్యూరో సభ్యుడి స్థాయికి ఎదిగే అవకాశం ప్రతి కార్యకర్తకు కల్పించే పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ఇక, మంత్రిగా బిజీ అయ్యానని, అందుకే పాదయాత్రలు కష్టమని అన్నారు. కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నానని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్ల వంటివని చెప్పారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అప్పగించిన ఏ బాధ్యతనైనా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉంటానని, నిబద్ధత గల కార్యకర్తగా తనవల్ల పార్టీకి ఏనాడూ చెడ్డపేరు రాలేదని అన్నారు. గతంలో సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసులో విచారణకు హాజరైన సందర్భంగా విశాఖలో లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన సొంత ఖర్చులతో విచారణకు నాలుగు సార్లు వచ్చానని, ఎన్నిసార్లైనా వస్తానని చెప్పారు. సొంత పనుల కోసం పార్టీ డబ్బు వాడకూడదన్న విషయం తన తల్లి భువనేశ్వరి నుంచి నేర్చుకున్నానని తెలిపారు.