అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయటం తెలిసిందే. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా ఎంపిక చేసిన గెల్లు శ్రీనివాస్ కు తాజాగా టీఆర్ఎస్ అధినేత కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తన వద్దకు పిలిపించుకొని మరీ బీఫారమ్ ఇవ్వటం గమనార్హం.
తాజా ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నదానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పాలి. గెల్లుకు బీఫారం ఇచ్చే వేళ.. ఆయన వెంట మంత్రులు హరీశ్ రావు.. వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పెద్ది రెడ్డి కూడా ఉన్నారు.
గురువారం రాత్రి గెల్లు చేతికి బీఫారమ్ ఇచ్చిన కేసీఆర్.. ‘హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధిస్తుంది. భారీ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా హైదరాబాద్ కు వస్తావు. హుజూరాబాద్ టీఆర్ఎస్ కు కంచుకోట. అక్కడ పార్టీకి పటిష్ఠమైన పునాది ఉంది. వ్యక్తులుగా కాకుండా పార్టీగా ఎదిగిన నియోజకవర్గమది. అంకిత భావంతో కార్యకర్తలు తమ భుజాలపై జెండా మోస్తున్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటు లేదు’ అని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.
తాను చేయించిన సర్వేలన్ని టీఆర్ఎస్ గెలుపు పక్కా అని చెబుతున్నాయని.. మరో పార్టీకి అక్కడ చోటే లేదన్న ధీమాను కేసీఆర్ వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్.. వేముల ప్రశాంత్ తో పాటు పెద్ది రెడ్డి.. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాల్ని చర్చించటం గమనార్హం.
అంతేకాదు.. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నిధి కింద రూ.28 లక్షల చెక్కును గెల్లు చేతిలో పెట్టిన కేసీఆర్.. ఉప ఎన్నికల ప్రచారానికి తాను కూడా వస్తానన్న భరోసాను ఇచ్చారు. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానన్న మాటకు తగ్గట్లే కేసీఆర్ తీరు ఉన్నట్లుగా చెప్పాలి.