రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ధ్వంసం చేసి.. అభివృద్ధి ఊసే ఎత్తకుండా.. వస్తున్న ఆదాయాన్ని, తెస్తున్న అప్పులను దారి మళ్లిస్తూ.. జనానికి ‘ఉచిత’ బిస్కెట్లు ఎర వేస్తున్న సీఎం జగన్ .. తన ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను అధిగమించడానికి నానా పాట్లు పడుతున్నారు. ఏదో ఒక పథకం కింద స్వీయ లబ్ధి ఉందో లేదో చూసుకోవాలని.. అభివృద్ధి గురించి మీకు అవసరమని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిన ఆయన.. ఇప్పుడు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. చంద్రబాబు పథకాలకు పేర్లు మార్చి.. లబ్ధిదారులను కుదించి.. వేల కోట్లు నగదు బదిలీ చేస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారు.
‘అన్నీ నేనే చేశా. నావల్లనే ప్రజలంతా బతుకుతున్నారు. నాకు సీఎం పదవిపై వ్యామోహం లేదు. మళ్లీ సీఎంగా నన్ను గెలిపించకపోతే పేదలకు అందే పథకాలన్నీ పోతాయి. పొత్తులతో వచ్చే వారిని కాదని పేదల కోసం పనిచేస్తున్న నన్ను గెలిపించండి’ అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నాలుగు సిద్ధం సభల్లో ఆయన ప్రసంగాల తీరు ఇలాగే ఉంది. నిజానికి భారీ ఖర్చుతో నిర్వహిస్తున్న సిద్ధం సభలకు జనం రావడం లేదు. యథాప్రకారం డ్వాక్రా సంఘాలను, లబ్ధిదారులను ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నారు. అయినా ప్రాంగణాలు నిండకపోవడంతో గ్రాఫిక్స్ రూపొందించి కూలి మీడియాలో ప్రసారం చేస్తున్నారు.
ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొరిశపాడు మండలం మేదరమెట్ల సమీపంలో దక్షిణ కోస్తాంధ్ర సిద్ధం సభ జరిగింది. గత 58 నెలలుగా ఆయా వర్గాలకు అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీని గెలిపించాలని, తనను మరోసారి సీఎంను చేయాలని, ఇందుకోసం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించాలని వేడుకున్నారు. రానున్నది ఎన్నికల మహాసంగ్రామమన్న జగన.. మూడు పార్టీలు ఏకమై వస్తున్నాయని, అయితే వారు సైన్యం లేని సైన్యాధిపతులని ఎద్దేవా చేశారు.
ఆ పార్టీల పరిస్థితి గత ఎన్నికల్లో చూస్తే ఒక పార్టీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తే, మరో పార్టీ చిత్తుగా ఓడిపోయిందన్నారు. ప్రజలను వంచన చేసేందుకు వారు ముగ్గురూ కలిసివస్తున్నారని, వారికి ఎల్లో మీడియా అండగా ఉందని అక్కసు వెళ్లగక్కారు. వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య సంగ్రామం అని పదేపదే చెప్పిన జగన.. అందులో పేదలు శ్రీకృష్ణుడిగా, తాను అర్జునుడిగా అభివర్ణించుకొని ముందుండి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. అయితే ఈ సభకు వైసీపీ నేతలు ఆశించిన విధంగా ప్రజల నుంచి కదలిక కనిపించలేదు. పలు నియోజకవర్గాల నుంచి ఆర్టీసీ, ప్రైవేటు, స్కూలు, కాలేజీ బస్సులతోపాటు పెద్ద సంఖ్యలో కార్లను ఏర్పాటు చేసినా స్పందన లేదు.
పలు ప్రాంతాల నుంచి బయల్దేరిన బస్సుల్లో జనం సంఖ్య తక్కువగానే కనిపించింది. ఇక బస్సులో సిద్ధం సభకు వెళ్లిన వారికి పలుచోట్ల మద్యం బాటిల్, బిర్యానీ ప్యాకెట్ అందజేశారు. మంచినీటి బాటిల్స్ మాదిరిగా బస్సుల్లో మద్యం సీసాల కేసులు వేయగా కొన్నింటిలో ఎక్కిన వారు ప్రయాణంలో బస్సుల్లోనే మద్యం సేవిస్తూ వె ళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అలాగే కొన్నిచోట్ల సభకు వచ్చే వారికి నగదు కూడా పంపిణీ చేశారు.
15-20 లక్షల మంది వచ్చినట్లు..
మేదరమెట్ల సిద్ధం సభకు భారీ జనసమీకరణ కోసం ఒకసారి సభను వాయిదా వేసినా.. పెద్దగా ఫలితమివ్వలేదు. పదిహేను నుంచి ఇరవై లక్షలు మంది వచ్చారని వైసీపీ నేతలు ప్రకటించుకోగా, సభ ఆవరణలో లక్షన్నరకు మించి ప్రజలు కనిపించలేదు. వారిలోనూ పలువురు సీఎం మాట్లాడే సమయంలో వెనక్కి మళ్లడం మొదలుపెట్టారు. పోలీసులు అడ్డుకున్నా.. వారిని తోసుకుని మరీ వెళ్లిపోయారు. పోయి వాహనాల్లో కూర్చున్నారు. బోసిపోయిన ప్రాంగణం చూసి వైసీపీ నేతలు.. గ్రాఫిక్స్ ప్రదర్శన చేసి అడ్డంగా దొరికిపోయారు. సభకు భారీగా జనం వచ్చారని చూపించేందుకు సభా ప్రాంగణం వద్ద వీఎ్‌ఫఎక్స్ గ్రీన మ్యాట్ వేసి టెక్నాలజీని వినియోగించుకున్నారు.
ఆ పార్టీ సోషల్ మీడియా మద్దతుగా ఉన్న బ్లూ మీడియా వీఎ్‌ఫఎక్స్ గ్రీన మ్యాట్ టెక్నాలజీ ద్వారా జనం భారీగా తరలివచ్చారని చూపే ప్రయత్నం చేశారు. సీఎం జగన ప్రసంగ ప్రత్యక్షప్రసారం కూడా కొద్ది నిమిషాలపాటు ఆలస్యంగా ఇచ్చారు. లైవ్ మధ్యలో గ్రాఫిక్స్ జత చేసి భారీగా జనం వచ్చినట్లు చూపే ప్రయత్నం చేశారు. సభలో ఒక డ్రోన కెమెరాతో వీడియో తీసేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చారు. జగన రాకముందు మంత్రి అంబటి రాంబాబు మాట్లాడే సమయంలో ఆవరణలో మరో డ్రోన కెమెరా చిత్రీకరణ చేస్తూ కనిపించింది. ఖాళీగా ఉన్న ప్రాంగణం కనిపిస్తుందని భయపడిన నేతలు టీడీపీ యువనేత లోకేశ్‌పై ఆరోపణలు గుప్పించారు.
ఆయనే ఆ డ్రోన్‌ను పంపారని దూషించారు. వెంటనే మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కూడా మైక్ ముందుకొచ్చి ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడారు బూతులు లంకించుకున్నారు. దీంతో హడావుడిపడిన పోలీసులు ఎగురుతున్న రెండో డ్రోన కెమెరాతోపాటు దానిని ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. వైసీపీకి చెందిన ఐప్యాక్ సంస్థ ప్రతినిధే ఆ కెమెరాను ఆపరేట్ చేస్తున్నారని తెలిసింది. అంతే.. అప్పటి వరకు రెచ్చిపోయి మాట్లాడిన వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు.
మినీ బార్లుగా వాహనాలు
సభకు జనాన్ని తీసుకొచ్చిన ప్రత్యేక వాహనాలన్నీ మినీ బార్లుగా మారిపోయాయి. అనేక ప్రాంతాల నుంచి పురుషులకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో ప్రతి ఒక్కరికీ ఒక పలావు పొట్లం, క్వార్టర్ మద్యం బాటిల్, మంచినీళ్ల సీసా ఇచ్చారు. కొన్ని వాహనాల్లో బీర్లు కూడా ఉంచారు. వాహనాల్లో ఎక్కిన వారంతా మద్యం సేవిస్తూ చిందులు తొక్కుతూ కనిపించారు. కొన్ని వాహనాల్లో మద్యం సేవించే పనిలో ఉండిపోయి వాహనాలు కూడా దిగలేదు.
సభా ఆవరణ సమీపంలోకి వచ్చిన బస్సులు కొన్ని అందులో ఉన్న ప్రజల ఒత్తిడితో వెంటనే వెనుదిరిగిపోవడం కనిపించింది. సిద్ధం సభల కోసం పోలీసు సిబ్బందిని భారీఎత్తున తరలించారు. దీంతో ఆయా జిల్లాల్లోని చాలా పోలీస్స్టేషన్లలో ఒకరిద్దరికి మించి పోలీసులు కనిపించలేదు. అదీ ఒకరోజు కాదు… సభలకు మూడు రోజుల ముందే వారిని వాడేస్తున్నారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి,