ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. టీడీపీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు..సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. ఏపీలో ఉన్మాది పాలన చూస్తున్నామని, జగన్‌రెడ్డిది వింత మనస్తత్వమని మండిపడడ్డారు. సీఎం జగన్ రెడ్డి అపరిచితుడు సినిమాలోలాగా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. జగన్‌రెడ్డి చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడని ఎద్దేవా చేశారు. జగన్ ఫేక్ సీఎం, ఫేక్ మాటలు, ఫేక్ పనులు, ఫేక్ పాలన చేస్తున్నాడని, అన్నివర్గాల ప్రజలపై దాడి చేస్తున్నారని ఆక్షేపించారు. జగన్ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేశాడని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరిగినా టీడీపీపై దుష్ప్రచారం చేసి బయటపడాలని జగన్ చూస్తాడని, కోర్టులు తీర్పులిచ్చినా, ఎన్నికల కమిషన్ ఎన్నికలు పెట్టినా, దాడులు, దౌర్జన్యాలు జరిగినా, ఆలయాలపై దాడులు జరిగినా అన్నింటికీ టీడీపీదే బాధ్యతగా నిందించి తన చేతగానితనం బయటకు రాకుండా చూసుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.
గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేసి, అన్ని స్థానాలకు మళ్లీ కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని, గ్రామ వలంటీర్లకు ఎన్నికల్లో భాగస్వామ్యం కల్పించొద్దని చెప్పారు. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు స్వీకరించాలని డిమాండ్ చేశారు. దౌర్జన్యాలతో నామినేషన్లు వేయకుండా అడ్డుకొనే వ్యవహారాల కు అడ్డుకట్ట వేసేందుకుఈ విధానం తేవాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. అన్ని రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ ఎందుకు జరపరని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ ఈసీ పని, దాని అధికార పరిధిని ప్రశ్నించే అధికారం అధికారులకు, ఉద్యోగ సంఘాల నేతలకు లేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎంకి ఏం సంబంధం? కోడ్ కారణంగా ఎన్నికలు పూర్తయ్యే వరకూ సీఎం ఇంటికే పరిమితం కావాలని చంద్రబాబు చెప్పారు. వైసీపీ నాయకులకు భయపడవద్దని, ఎక్కడ దాడులు, దౌర్జన్యాలు జరిగితే, అవసరమైతే తానే వచ్చి నిలబడతానని చంద్రబాబు చెప్పారు.
జేట్యాక్స్ వసూళ్ల కోసం మద్యం, ఇసుక, సిమెంటు ధరలు పెంచారని, కంపెనీలను తరిమేయడం వల్ల 32 లక్షల ఉద్యోగాలు పోయాయని చంద్రబాబు మంండిపడ్డారు. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, 8 లక్షల రేషన్ కార్డులు తొలగించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో అన్ని మతాల వారికీ అండగా ఉన్నామని, కానీ, జగన్ .. రాష్ట్రంలో 140 ఆలయాలపై దాడులు జరిగితే ఒక్కచోటకైనా జగన్ వెళ్లారా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు నదిలో మునకేసి హిందువునని భ్రమ కల్పించి జగన్ మోసం చేశాడని మండిపడ్డారు. తాను హిందువునని చెప్పడానికి భయపడలేదని, తాను క్రైస్తవుడినని చెప్పుకోవడానికి జగన్ కు భయమెందుకని ప్రశ్నించారు. నెల్లూరు ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడడిన జగన్…చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబసభ్యులను వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.