కొండలా అప్పులు!

లక్ష కోట్లకు చేరిన బకాయిలు
వైసీపీ సర్కారువే 70వేల కోట్లు
పాత ప్రభుత్వంలోవి 30వేల కోట్లు
అంగన్‌వాడీ సరుకుల నుంచి
ఉపాధి చెల్లింపుల వరకు అన్నీ పెండింగ్‌
చెల్లించకుండా చేతులెత్తేసిన ప్రభుత్వం
దయనీయంగా ఆర్థిక పరిస్థితి
ఆదాయానికి 3 రెట్లు ఖర్చు
తెచ్చే అప్పులన్నీ సంక్షేమానికే
ఆదాయంతో జీతాల చెల్లింపులు
ఉద్యోగుల వేతనాలపైనా అసత్యాలు
సాక్షాత్తూ కాగ్‌కే తప్పుడు లెక్కలు
నవ్యాంధ్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ దుర్భరంగా తయారవుతోంది. ఓవైపు అప్పులు కొండలా పేరుకుంటున్నాయి. ఇంకోవైపు.. అదే స్థాయిలో వివిధ సంస్థలు, కాంట్రాక్టర్లకకు చెల్లించిన బకాయిలు కూడా పెరిగిపోతున్నాయి. అలా చెల్లించాల్సిన మొత్తం అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు! ఈ లక్ష కోట్లలో సుమారు 70 వేల కోట్లు అచ్చంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక చెల్లింపుల కోసం సమర్పించిన బిల్లులే. దాదాపు 30 వేల కోట్ల రూపాయల బిల్లులు గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్నవి. ‘పాత ప్రభుత్వ బిల్లులు మేం చెల్లించం’ అని వైసీపీ సర్కారు తేల్చేయడం, మరికొన్ని బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ అంగీకరించకపోవడంతో అవన్నీ పెండింగ్‌లో పడ్డాయి!
అంగన్‌వాడీ పిల్లలకు ఆహారం ఇవ్వాలి. సాంఘిక సంక్షేమ పాఠశాలలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించాలి. కొత్తగా వేసిన రోడ్లు కాకపోయినా. పాత పనులను కొనసాగిస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి. ప్రభుత్వ భవనాలు, సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకూ డబ్బులు ఇవ్వాలి. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకూ బిల్లులు చెల్లించాలి. ఇంకా అనేక రకాల పనులు! జగన్మోహన్‌రెడ్డి గద్దెనెక్కాక చేసిన అప్పు దాదాపు రూ.1.35 లక్షల కోట్లు! ఇవన్నీ సంక్షేమ పథకాలకు చెల్లిస్తున్నారు. వస్తున్న ఆదాయం ప్రభుత్వోద్యోగుల జీతాలకే చాలడం లేదు.
అధికారుల్లో ఆందోళన..
సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ఒక్క సంవత్సరం బిల్లులు కొంతవరకు పెండింగ్‌లో ఉంటాయి. వైసీపీ వచ్చాక ఒకటి-రెండు అస్మదీయ కాంట్రాక్టు సంస్థలకు తప్ప.. మిగిలిన వారందరికీ బకాయి పెట్టేస్తోంది. లక్ష కోట్ల బకాయిల లెక్క వినగానే అధికారుల గుండె గుభేల్‌మంటోంది. ఒక్క ఉపాధి హామీ పథకం బిల్లులే దాదాపు రూ.2,500 కోట్ల వరకు ఉన్నాయి. ఆర్థిక కష్టాలు, అప్పులతో లాక్కొస్తున్న సర్కారు.. రూ.లక్ష కోట్ల బిల్లులను చెల్లించలగలదా అనే సందేహం తలెత్తుతోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల ప్రకారం... ఆ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటే మూడు బడ్జెట్లు ఎదురుచూడాల్సిందే. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.1,10,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రూ.60,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఈఏపీ, నాబార్డు, ఆర్‌ఐడీఎఫ్‌, ఇతర ప్రాజెక్టుల నిధులు రూ.20,000 కోట్లు. వీటిని వేరే పథకాలకు ఖర్చు పెట్టడానికి లేదు. మిగిలిన రూ.30,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిర్వహించి, బిల్లులు చెల్లించాలి. సంక్షేమ పథకాల కోసం పూర్తిగా ప్రభుత్వం అప్పుల మీదే ఆధారపడుతోంది! మిగిలిన రూ.30,000 కోట్లతో అచ్చంగా బిల్లులు చెల్లిస్తారనుకున్నా... మొత్తం పెండింగ్‌ క్లియర్‌ కావడానికి మరో మూడు బడ్జెట్లకుపైనే పడుతుంది. ‘సంక్షేమ పథకాల అమలు కోసం పూర్తిగా అప్పుల మీద ఆధారపడుతున్న ప్రభుత్వం... తలకిందుల తపస్సు చేసినా ఈ పెండింగ్‌ బిల్లుల కొండను క్లియర్‌ చేయలేదు. సంక్షేమ పథకాలా? బిల్లులా? అనేది తేల్చుకోవాల్సిందే’’ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఖర్చు మూడింతలు.. రుణం రెట్టింపు..
అక్టోబరులో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.5,940 కోట్లు కాగా.. రూ.15,180 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే.. మూడు రెట్లు అధికంగా ఖర్చు చేశారు. ఆగస్టు నెలలోనూ ఇదే పరిస్థితి. ఆ నెలలో రూ.4,550 కోట్లు వస్తే రూ.12,700 కోట్లు ఖర్చయింది. జూన్‌, జూలై నెలల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఏ నెల చూసినా ఆదాయానికి మూడింతలు వ్యయం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో వచ్చిన పన్నుల ఆదాయం కేవలం రూ.15,000 కోట్లు. నిజానికి ఈ ఆరు నెలల్లో రూ.35,000 కోట్ల వరకు పన్ను ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో ఆశించారు. ఆదాయంపై కరోనా ప్రభావం ఉన్నప్పటికీ. రాబడిపై సర్కారు అతిగా అంచనాలు వేసుకుంది. ఆదాయం పెంచుకునే మార్గాలు మరిచిపోయి, అప్పుల కోసం మాత్రం వినూత్నమైన ఆలోచనలు చేస్తోంది. రోడ్ల మరమ్మతులకు తట్ట మట్టి కూడా ఎత్తలేని రాష్ట్రానికి రూ.25,000 కోట్లు అప్పులిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయంటూ.. దాని కోసం ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఏకంగా రూ.25,000 కోట్ల అప్పులకు హామీ ఇచ్చింది. నిజానికి... ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి నేపథ్యంలో రూ.7,000 కోట్ల గ్యారంటీలు ఇచ్చేందుకు మాత్రమే అవకాశం ఉంది. అయినా సరే... పాతిక వేల కోట్లకు పూచీకత్తు ఇవ్వడం గమనార్హం.
ఉద్యోగులకు ఇచ్చింది సగం జీతమే
ఉద్యోగుల జీతాలకు ప్రతి నెలా సుమారు రూ.3,000 కోట్ల నుంచి రూ.3,600 కోట్ల వరకు చెల్లిస్తారు. కానీ కరోనా సాకుతో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వం సగం వేతనమే చెల్లించింది. మార్చిలో రూ.1516కోట్లు, ఏప్రిల్‌లో రూ.1817కోట్లే ఇచ్చింది. కాగ్‌కు మాత్రం వరుసగా రూ.3,032 కోట్లు, రూ.3,634.27 కోట్లు చెల్లించినట్లు తప్పుడు లెక్కలు సమర్పించింది. వాటినే కాగ్‌ తన నివేదికలో చూపించింది. ఈ విషయంపై సమాచార హక్కు చట్టం కింద కొందరు కాగ్‌ను అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లెక్కల ఆధారంగానే నివేదికను రూపొందించామని కాగ్‌ స్పష్టం చేసింది. నెలవారీగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వ్యయం లెక్కల ఆధారంగానే తమ నివేదిక ఉంటుందని తెలిపింది. మేధావులుగా ముసుగు వేసుకుని ఎన్నికలకు ముందు జగనను సమర్థించినవారెవరూ ఇప్పుడు అదేమని అడగట్లేదు. అడిగే పరిస్థితీ లేదు. అడిగితే ఏమవుతుందో వారికి తెలుసు మరి!!

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.