రాజకీయాల్లో నోరు ఉండొచ్చు.. కానీ, నోటి దూల ఉండకూడదు. ఇలా నోటి దూల ఉన్నవారి పరిస్థితి ఎలా మారుతోందో ఇప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు. పార్టీ అధినేతను మచ్చిక చేసుకునేందుకు నోరు చేసుకున్నవారు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతూ.. స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇక, వైసీపీ అధినేత జగన్ కు ఈ విషయంలో మరో విధంగా పరాభవం ఎదురవుతోంది. ఆయన స్వయంగా రెండు సార్లు నోరు పారేసుకున్నారు. ఆ రెండు సార్లు కూడా.. ఆయనకు ఘోర పరాభవమే ఎదురైంది.
ఈ విషయంలో ఆయన చేసేది లేక.. చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కూడా కళ్లకు కడుతోంది. గతంలో 2014-19 మధ్య ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న జగన్.. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వద్ద.. కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో జగన్‌కు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్ వ్యవహరించారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ వైపు చూస్తున్నారని.. 40 నుంచి 50 మంది తమ పార్టీలోకి వచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నారని నోటి దూల ప్రదర్శించారు.
ఆ వెంటనే అలెర్ట్ అయిన.. చంద్రబాబు చడీ చప్పుడు లేకుండా.. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీశారు. ఇంకే ముంది.. నేరుగా.. వైసీపీ నుంచి జగన్ లెక్క ప్రకారం 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి సైకిల్ ఎక్కారు. ఇద్దరు ఎంపీలు కూడా.. దూరమయ్యారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగినప్పుడు.. జగన్ తమను నిర్వీర్యం చేసి.. ప్రభుత్వాన్ని కూలదూసే కుట్రలకు తెరదీశాడని.. అందుకు.. తాము ముందే ప్రిపేర్ అయి.. వైసీపీ నుంచి తీసుకుంటే తప్పేంటని అప్పట్లో టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు.
దీంతో జగన్ నోటి దూలే.. ఆ పార్టీకి, ఆయనకు పరాభవాన్ని తీసుకువచ్చింది. కట్ చేస్తే.. 2019-24 మధ్య జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. జగన్ మరోసారి ఇలానే నోటి దూల చేసుకున్నారు. “చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదారుగురు ఎమ్మెల్యేలను మేం లాగేస్తే.. ఆయనకు ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోతుంది“ అని సభలోనే వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు అసలు ఎవరూ తీసుకోకుండానే ప్రజలు వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు.
దీంతో ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కావాలని ఆయన యాగీ చేస్తున్నా.. టీడీపీ నాయకులు.. గతంలో జగన్ అన్న మాటలనే గుర్తు చేస్తూ.. ప్రధాన ప్రతిపక్షం ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. సో.. ఏదేమైనా.. కీలక స్థానాల్లో ఉన్న నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే.. భవిష్యత్తు ఎలాంటి పాఠాలు నేర్పిస్తుందో చెప్పడానికి జగనే ఉదాహరణ అంటున్నారు పరిశీలకులు.