హైదరాబాద్ నుంచి ఏపీకి సినీరంగం తరలిరావాలని, ఏపీలో కూడా సినీ టూరిజం డెవలప్ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అదే అభిప్రాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కూడా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సినిమా రంగంలో, షూటింగుల్లో అమరావతి కూడా ప్రభావితం చూపుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలో సినీ రంగానికి, షూటింగులకు బెజవాడ కేంద్రంగా ఉండేదని, ఆ తర్వాత హైదరాబాద్కు తరలి వెళ్లిందని చంద్రబాబు అన్నారు. అయినప్పటికీ, ఆదాయపరంగా కోస్తా ప్రాంతమే సినీ రంగానికి కీలకంగా ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ జనాభా కోటి దాటి అక్కడ సినీ రంగానికి ఆదాయం పెరిగిందని గుర్తు చేశారు.
అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయని, తెలుగు సినిమాలకు ఇప్పుడు విదేశాల్లో ఎక్కువ ఆదాయం వస్తోందని అన్నారు. విదేశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాల నిర్మాణం, పంపిణీ జరుగుతోందని చెప్పారు. భవిష్యత్తులో అమరావతి కూడా సినీ రంగంపై ప్రభావం చూపించే స్థాయికి ఎదుగుతుందని ఆకాంక్షించారు.