ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా తన వ్యవహార శైలితో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రతినిత్యం ప్రజలతో మమేకం అవుతూ ప్రజా ప్రయోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ఒక సామాన్యుడిగా మసులుకుంటున్నారు. మొన్నటికి మొన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడులో గిరిజన మహిళలతో కలిసి ఆయన నృత్యం చేశారు. కళాకారుల డప్పు కొట్టి అందర్నీ ఉత్సాహపరిచారు.
తాజాగా సీఎం చంద్రబాబు కెమెరామెన్ గా మారిపోయారు. ఈ ఇంట్రెస్టింగ్ సీన్ ఉండవల్లిలోని ఆయన నివాసంలో చోటుచేసుకుంది. వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా చంద్రబాబు నాయుడు సోమవారం తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫొటో జర్నలిస్టులను కలిశారు. వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కెమెరా చేతపట్టి ఫొటో జర్నలిస్టులను క్లిక్ క్లిక్ మంటూ ఎంతో హుషారుగా ఫొటోలు తీశారు.
స్వయంగా రాష్ట్ర సీఎం తమకు ఫొటోలు తీయడంతో ఫొటో జర్నలిస్టులు తెగ మురిసిపోయారు. ఆపై వారితో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. ఫొటోగ్రఫీ రంగంలో ప్రతిభ చూపుతున్న వారందరికీ చందబ్రాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాణ్యమైన సేవలతో ఫొటోగ్రఫీ రంగం బాగుండాలని ఆయన ఆకాంక్షించారు.