ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పాలన రైలు పట్టాల మీద బుల్లెట్ ట్రైన్ మాదిరిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు రాష్ట్రంలోనే సంపద సృష్టించేందుకు టిసిఎస్ వంటి కంపెనీలతోపాటు పలు సంస్థలకు రెడ్ కార్పెట్ వేస్తున్న చంద్రబాబు…మరోవైపు కేంద్రం నుంచి రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు ఆమోద ముద్ర వేయించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది.
ఈ నేపథ్యంలోనే అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. నాలుగేళ్లలో ఈ అమరావతి రైల్వే ప్రాజెక్టు పూర్తవుతుందని, కృష్ణా నదిపై కట్టే రైల్వే వంతెనను ఐకానిక్ బ్రిడ్జిగా నిర్మించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరామని చంద్రబాబు అన్నారు. దేశంలోని అత్యుత్తమ నగరాలలో అమరావతి ఒకటిగా నిలుస్తుందని, అమరావతి నిర్మాణం కోసం కేంద్రం అనేక మార్గాలలో సాయం చేస్తోందని చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి నగరాన్ని హైదరాబాద్, కోల్ కతా, చెన్నై నగరాలకు అనుసంధానం చేసేలా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టబోతున్నారని, 2245 కోట్ల వ్యయంతో 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించనున్నారని వెల్లడించారు. దాంతోపాటు కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర భారీ వంతెనని కూడా నిర్మించబోతున్నారని అన్నారు. ఈ రైల్వేజోన్ తో అమరావతికి దక్షిణ, మధ్య, ఉత్తర భారతదేశంతో అనుసంధానం ఏర్పడుతుందని చెప్పారు. అంతేకాకుండా, ఈ రైల్వే ప్రాజెక్టుకు మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్ట్‌లను కూడా అనుసంధానించబోతున్నారని తెలిపారు. తక్కువ సమయంలో అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో చేసిందని, కేబినెట్ ఆమోదం కూడా లభించడం హర్షణీయమని అన్నారు.