ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజాగా తన సతీమణి భువనేశ్వరి కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ను కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఒక బహిరంగ సభలో భువనేశ్వరి మాట్లాడుతూ.. వివాహం తర్వాత చంద్రబాబు కేవలం ఒక్కసారి మాత్రమే తనకు చీరను కొనిచ్చారని.. కానీ ఆ చీర రంగు, నాణ్యత అస్సలు బాలేదని చెప్పుకొచ్చారు. ప్రజా జీవితంలో ఉన్నందున భార్య కోసం చంద్రబాబు షాపింగ్ చేసిన దాఖలాలు లేవని చెప్పుకొచ్చే ప్రయత్నంలో భువనేశ్వరి ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే అప్పటి భువనేశ్వరి మాటలు గుర్తుకొచ్చాయో ఏమో కానీ.. తాజాగా చంద్రబాబు సతీమణి కోసం రెండు చీరలను కొనుగోలు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలజీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను సీఎం తన చేతుల మీదగా ప్రారంభించారు. ఆపై ప్రతి స్టాల్ దగ్గరకు వెళ్లి చేనేత దుస్తులను పరిశీలించారు.
ఈ క్రమంలోనే రెండు చీరలు బాగా నచ్చడంలో చంద్రబాబు వాటిని కొనుగోలు చేసింది. భువనేశ్వరి కోసం వెంకటగిరి, ఉప్పాడ జాందాని చీరలను చంద్రబాబు తీసుకున్నారు. ఆయా చేనేత చీరల ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకున్నారు. ఆపై డబ్బులు ఇచ్చి వాటిని ప్యాక్ చేయించుకున్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తమవద్ద చీరలు కొనుగోలు చేయడంతో సదరు చేనేత కార్మికులు ఆనందంలో మునిగిపోయారు. మరోవైపు నెటిజన్లు ఈసారైనా సీఎం గారు తెచ్చిన చీరలు భువనమ్మకు నచ్చుతాయో..లేదో.. అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, చేనేత కార్మికులతో కాసేపు ముచ్చటించిన అనంతరం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. మన చేనేత కళాకారులు తయారు చేసిన చీరలు చాలా బాగున్నాయని.. అందుకే తన సతీమణికి రెండిటిని కొనుగోలు చేశానన్నారు. ఆడిటోరియంలో సుమారు 80కి పైగా స్టాల్స్‌లో ఉన్నాయని.. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇవ్వడంతో పాటు మగ్గానికి రూ.50వేలు, 200 యూనిట్ల విద్యుత్, జీఎస్టీ రద్దుతో సహా కొన్ని వరాలు ప్రకటించారు.