ఏపీ మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. గతంలో టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్రసవం తరువాత ఇన్ఫెక్షన్ సోకకుండా శిశువుల్ని సంరక్షించాలనే మంచి ఉద్దేశంతో 2016 జూలై 12న రాష్ట్రంలో చంద్రబాబు స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
రూ. 800 విలువైన బేబీ పౌడర్, లోషన్, న్యాప్కిన్, డైపర్స్, దుప్పటి, దోమతెర, స్లిపింగ్ బెడ్ మరియు సోప్స్ ను జిప్ బ్యాగ్లో ఉంచి బాలింతలకు అందించేవారు. అయితే 2019 నుంచి జగన్ సర్కార్ ఈ పథకాన్ని నిలిపి వేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. టీడీపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టడంతో చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్న కూటమి సర్కార్.. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, తెలంగాణ, ఒడిశా లో అమలవుతున్న ఈ తరహా పథకాలను ఏపీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి రూ.1,200 నుంచి రూ.1,300 వరకు ఖర్చు పెడుతున్నారు. త్వరలో ఏపీలో కూడా ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకం అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో ‘ఆసరా’ కింద బాలింతలకు రూ.5 వేలు ఇస్తున్నారు. ఈ పథకాన్ని కూడా కూటమి సర్కార్ కంటిన్యూ చేస్తోంది.