నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పట్టిన జగన్ శని తొలగిపోయింది. ఇచ్ఛాపురం నుంచి రాయదుర్గం దాకా వైసీపీని కోలుకోలేని దెబ్బతీసిన జనం ఏరికోరి చంద్రబాబు ను మరోసారి సీఎంను చేశారు. దీంతో అమరావతికి పూర్వ వైభవం వస్తోంది. ఐదేళ్లుగా ముళ్లకంపలు, శిథిలమైన రోడ్లు, పాడైపోయిన భవనాలతో నిర్మానుష్యంగా మిగిలిపోయిన నవనగరాలకు పట్టిన గ్రహణం వీడిపోయింది.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలై జగన్ గద్దె దిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరక ముందే పనులు శరవేగంతో పరుగులు పెట్టాయి. జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసేనాటికి.. అంటే 8 రోజుల్లోనే సర్వాంగసుందరంగా తయారయ్యాయి. అప్పటివరకూ రాజధాని గ్రామాల ముఖం కూడా చూడని రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అధికారులు రాజధాని రోడ్లపై ఉరుకులు పరుగులు పెడుతూ ఆగమేఘాల మీద పనులు చేయించారు.. ఇప్పుడూ చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు, సీఆర్డీఏ కమిషనర్ వరకూ అమరావతిలో పర్యటిస్తూ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
వీరు దగ్గరుండి సమీక్షిస్తుండడంతో రాజధాని గ్రామాల్లో పనులు ముఖ్యంగా రహదారుల నిర్మాణం రాకెట్ వేగంతో జరుగుతున్నాయి. జగన్ అమరావతిని భ్రమరావతి అని.. కమ్మరావతి అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆయన మంత్రి బొత్స సత్యనారాయణ, నాటి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అమరావతిని ఎడారితో, శ్మశానంతో పోల్చారు. ఇద్దరూ తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. జగన్ ఆదేశాలతో అమరావతిని నిజంగానే అటవీప్రాంతంగా తయారుచేసిన అధికారులే దగ్గరుండి మరీ ఆ అడవిని తిరిగి మానవ నగరంగా మలిచేందుకు కృషిచేస్తున్నారు.
రేయింబవళ్లూ అభివృద్ధి పనులు..
టీడీపీ కూటమి తిరుగులేని విజయం సాధించిన మరుక్షణమే.. కాబోయే సీఎం చంద్రబాబు అమరావతిపై దృష్టిసారించారు. కొత్త సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ తన ప్రాధాన్యాలను విశదీకరించారు. అంతే.. ఆయన ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన అధికారులు పనులు చేపట్టారు. అడవులను తలపించేటట్లుగా ఉన్న 29 గ్రామాల్లో 100కు పైగా పొక్లయిన్లతో జంగిల్ క్లియరెన్స చేపట్టారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లను శుభ్రం చేయడానికి, విద్యుత ట్రాన్సఫార్మర్లు, లైన్లు, వీధిలైట్లు ఏర్పాటు చేయడానికి వందల మందిని నియోగించారు.
రాజధాని రవాణాకు ఆయువుపట్టు అయిన సీడ్ యాక్సిస్ రోడ్డుకు సొబగులు అద్దుతున్నారు. వాడకం లేక శిథిలమై, మొక్కలు మొలిచిన రోడ్లను శుభ్రం చేసేశారు. డివైడర్లపై వీధి దీపాలు అమర్చేశారు. మరోవైపు ఐదేళ్లుగా పట్టించుకొనే నాథుడు లేకపోవడంతో నిర్మాణం దాదాపు పూర్తయిన ప్రభుత్వ భవనాలన్నీ శిథిలాలయాలుగా మారిపోయాయి. అటువైపు వెళ్లేందుకు దారి కూడా లేకుండా రోడ్లపై కంప చెట్లు పెరిగిపోయాయి. నాలుగే నాలుగు రోజుల్లో అధికారులు వాటి ఆనవాళ్లే లేకుండా చేశారు.
ఆ భవనాలకు వెల్లవేశారు. ఆకాశ హర్మ్యాలు సుందరంగా దర్శనమిస్తున్నాయి. అవిప్పుడు విద్యుత కాంతుల వెలుగులో జిగేల్ మంటున్నాయి. భవనాల్లో అసంపూర్తిగా ఉన్న పనులు మొదలైపోయాయి. గట్టిగా ఐదారు నెలల్లో వాటిని అందుబాటులోకి తెస్తామని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం ఆగిపోయిన సీఆర్డీఏ కార్యాలయ భవనం ఇప్పుడు ముగింపు దశకు చేరింది. దాదాపు రంగులు కూడా పూర్తయి మెరుగులు దిద్దేదశలో ఉంది. ఇంటీరియర్ పనులు కూడా పూర్తిచేసి మరో రెండు నెలల్లో అక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. దాదాపు పూర్తయిన ఎమ్మెల్యే క్వార్టర్లు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు దుమ్ము దులుపుకుని కనువిందు చేస్తున్నాయి.
శంకుస్థాపన ప్రాంతానికి మహర్దశ
ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రాంతం కళకళలాడుతోంది. ప్రధాని మోదీ పునాదిరాయి స్వయంగా పునాది రాయి వేసి ఈ ప్రాంతం నిన్నటిదాకా కంపచెట్ల మాటున కనబడకుండా పోయింది. ఫలితాలు వచ్చిన మర్నాడే ఇది కొత్త శోభను సంతరించుకుంది. శిలాఫలకాలు, మ్యూజియం చుట్టూ ఉన్న కంపచెట్లను తొలగించి అందంగా తీర్చిదిద్దారు. అమరావతిలో పనులు వేగం పుంజుకోవడంతో రాకపోకలు కూడా పెరిగాయి. నిన్నటి వరకూ వెలవెలబోయిన సీడ్ యాక్సిస్ రోడ్డు వాహనాల రాకపోకలతో కళకళలాడుతోంది. ఈ క్రమంలో రాజధానిలో అభివృద్ధి పనులు చూసేందుకు వచ్చే పర్యాటకల సందడి కూడా మొదలయింది.
అమరావతి రైతుల కౌలుపై నివేదిక
అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపులపై ప్రభుత్వ ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు నివేదిక సిద్ధంచేశారు. వార్షిక కౌలు చెల్లింపులు పోను.. బకాయిలు ఎంత ఉన్నాయో లెక్కలు వేశారు. ప్రధానంగా 2024-25 సంవత్సరానికి పూర్తిగా కౌలు చెల్లించాల్సి ఉంది. కోర్టును ఆశ్రయించిన కొందరికి తప్పితే మిగతావారికి పైసా ఇవ్వలేదు. ఎన్నికలకు 6 నెలల ముందే జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చినా నిధులు మాత్రం కేటాయించలేదు. అప్పట్లో 33,670.1 ఎకరాల పట్టా భూములను పూలింగ్ కింద తీసుకున్నారు.
వీటికి సంబంధించి మొత్తం 29,209 మంది రైతులకు రూ.241.61 కోట్ల మేర కౌలు చెల్లింపులు చేయాల్సి ఉంది. అసైన్డ్ కేటగిరీ భూములకు సంబంధించి 3,845 ఎకరాలకు గాను 3,729 మంది రైతులకు రూ.22.68 కోట్ల మేర వార్షిక కౌలు చెల్లించాల్సి ఉందని లెక్కించారు. గత ఐదేళ్లలో వివిధ కారణాలతో కౌలు బకాయిల వివరాలను కూడా పొందుపరిచారు.
అలాగే విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయాభివృద్ధికి సంబంధించి భూసమీకరణ విధానంలో భూములు ఇచ్చినవారికి కూడా అమరావతి రాజధానిలో ప్యాకేజీ కల్పించారు. వీరికి కూడా వార్షిక కౌలు ఇవ్వాల్సి ఉంది. విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు చాలాకాలంగా వార్షిక కౌలు చెల్లించడం లేదు. ఈ వివరాలను కూడా జతచేర్చారు. సీఎం చంద్రబాబు, పట్టణాభివృద్ధి మంత్రి పి.నారాయణ దీనిని పరిశీలించాక కౌలు చెల్లింపు ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉంది.