వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో 4.6 లక్షల కోట్ల అప్పు చేశారని కూటమి ని ప్రకటించిందిని వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ అప్పులపై ఈ రోజు శాసన సభలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ దిగిపోయే సమయానికి ఏపీ మొత్తం అప్పు రూ.9,74,556 కోట్లు అని, జగన్ కు ఏమైనా డౌట్స్ ఉంటే అసెంబ్లీకి వస్తే క్లియర్ చేస్తానని చంద్రబాబు అన్నారు.
జగన్ అప్పులు..ఆయన చేసిన తప్పుల వల్లే రాష్ట్రానికి ఈ తిప్పలు వచ్చాయని చంద్రబాబు మండిపడ్డారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేసి జగన్ కట్టిన రుషికొండ ప్యాలెస్ చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయని, ప్రజల సొమ్ముతో ఇన్ని వందల కోట్ల ప్యాలెస్ లు కట్టడం సిగ్గు చేటని జగన్ పై ధ్వజమెత్తారు. 400 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రకటలను సాక్షి పేపర్ కు ఇచ్చారని, ఇంకా పలు చోట్ల ప్రజాధనం దుబారా చేశారని ఆరోపించారు.
ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీని సర్వనాశనం చేశాడని, జీఓలను ఆన్లైన్ పెట్టలేదని, కాగ్ నివేదికలు తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే.. ఐదేళ్ల జగన్ పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. వేరుశెనగ పంటను అడవి పందులు నాశనం చేసిన మాదిరిగా ఏపీని వైసీపీ నాశనం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
జగన్ దిగిపోయేనాటికి ఆంధ్రప్రదేశ్ అప్పుల వివరాలు…
ఏపీ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు
గవర్నమెంట్ అప్పు – రూ.4,38,278 కోట్లు
పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ – రూ.80,914 కోట్లు
కార్పొరేషన్ అప్పు – రూ.2,48,677 కోట్లు
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ – రూ.36,000 కోట్లు
పవర్ సెక్టార్ – రూ.34,267 కోట్లు
అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ – రూ.1,13,244 కోట్లు
అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ – రూ. 21,980 కోట్లు
నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ – రూ.1,191 కోట్లు.