అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జరిగిన ఘోర ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వారి కుటుంబాల కు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామన్నారు. అదేవిధంగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అధునాతన వైద్యం అందించడంతోపాటు.. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీకూడా చేయిస్తామని చెప్పారు. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
తాజాగా అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. అచ్యుతాపురం ఘటనలో గాయాలపాలై మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిచారు. బాధితుల వద్దకు వెళ్లి.. స్వయంగా వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. కొందరితో సీఎం ముచ్చటించగా.. మరికొందరిని చూసి ఆయన మౌనంగా ఉండిపోయారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా.. వెనుకాడవద్దని.. బాధితులు త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులకు సూచించా రు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. వాటిని చక్కదిద్దే పనిలో ఉన్నామని.. ఇంతలోనే ఈ ఘోరం సంభవించిందన్నారు. మొత్తం 17 మంది మృతి చెందారని, 36 మందికి గాయాలయ్యాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షల చొప్పున సాయంచేస్తామని చెప్పారు. కాగా… ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని చంద్రబాబు అన్నారు.