కొంతకాలంగా సీఎం జగన్ వైఫల్యాలను, వైసీపీ నేతలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఎత్తిచూపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై సెక్షన్ 124-A (రాజద్రోహం నేరం కింద కేసు) కేసు పెట్టారని రఘురామ ఆరోపించారు. అంతేకాదు, ఈ సెక్షన్ ను కొన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని, ఆ సెక్షన్ రద్దుకు చేస్తున్న పోరాటంలో తనతో కలిసి రావాలని దేశవ్యాప్తంగా ఉన్న తన తోటి ఎంపీలకు రఘురామ లేఖలు రాశారు.
ఈ సెక్షన్ ను జగన్ సర్కార్ దుర్వినయోగపరిచిన వైనంపై పలువురు ఎంపీలు స్పందించి రఘురామకు బాసటగా నిలిచారు. ఈ క్రమంలోనే ఆ సెక్షన్ రద్దుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఆ సెక్షన్ పై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. 124-A సెక్షన్ దుర్వినియోగం అవుతోందని, ఈ సెక్షన్ కింద శిక్షలు పడ్డ కేసులు కూడా నామమాత్రమేనని అన్నారు.
సెక్షన్ 124-A ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలున్నాయని అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి.. బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా? లేదా అని పరిశీలించాల్సిన సమయం అసన్నమైందన్నారు.
పాత కాలపు.. పనికిమాలిన చట్టాలను తొలగించిన ప్రభుత్వం.. ఈ చట్టం జోలికి ఎందుకు వెళ్ళలేదు? అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. కొయ్యను మల్చడానికి వడ్రంగి చేతికి రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్టు ఈ చట్టం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యవస్థలకు, వ్యక్తులకు ఈ చట్టం వల్ల తీరని నష్టం జరుగుతోందని, 124-A సెక్షన్ రద్దు చేయాలని ఎడిటర్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు.. ఈ సెక్షన్ కు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి విచారణ జరపడానికి ధర్మాసనం అంగీకరించిందని, ఈ విషయంలో కేంద్రానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసిందని అన్నారు. తాజా వ్యాఖ్యలతో రాజద్రోహం సెక్షన్ పై పోరు విషయంలో రఘురామకు జస్టిస్ ఎన్వీ రమణ బాసట నిలిచినట్లయిందన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.