సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ చేసిన ప్రసంగంలో కీలక అంశాలివి. శాన్ ఫ్రాన్సిస్కో దారుల్లో ఆయన తెలుగు భాష ఔన్నత్యం, భాషల మధ్య, సంస్కృతుల మధ్య ఉండాల్సిన సమతుల్యం, సమ్మిళిత సంస్కృతిని గౌరవించుకునే విధానం వీటన్నింటి గురించి ఆయన మాట్లాడారు. తెలుగు వారంతా తెలుగులోనే మాట్లాడాలని విదేశీ గడ్డపై నినదించి, సమున్నత రీతిలో భాష ఔన్నత్యాన్ని చాటారు.
ప్రభుత్వాలు దార్శినికతతో వ్యవహరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన భారతీయ అమెరికన్ల సదస్సులో ఆయన ప్రసంగించి పలు ఆసక్తిదాయక విషయాలు వివరించారు. ముఖ్యంగా దేశం, సంస్కృతి, భాష వంటి విషయాలను వివరిస్తూ, వాటి ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ ప్రసంగించారు.
ప్రభుత్వాలు మారినంతనే దార్శినికతతో కూడిన ఆలోచనల అమలు ఆగిపోకూడదు.. సొంత భూభాగ అభివృద్ధికి దోహదం చేసే నిర్ణయాలు తీసుకుంటూనే పాలన సాగించాలి.. అన్న అర్థం వచ్చే విధంగా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతుంటాయి. విజ్ఞత, దేశభక్తి ఉన్న ప్రభుత్వాలు వృద్ధిని మందగింపు జేసే నిర్ణయాలు తీసుకోకూడదు అని హితవు చెప్పారు.
ముఖ్యంగా భారతీయ పార్టీలు ప్రతి చర్యనూ న్యాయ వ్యవస్థలు ఆమోదించాలి అని అనుకుంటున్నాయి, విపక్షాలు తమ రాజకీయ వ్యవహారాలు ప్రోత్సహించేలా కోర్టులు ఉండాలని కోరుకుంటున్నాయి.. కానీ న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికే జవాబుదారీగా ఉంటుంది అని గుర్తు పెట్టుకోవాలి.. అని అన్నారాయన.
వైవిధ్యతలు నిండిన అమెరికా సమాజం నుంచి సమ్మిళిత్వాన్ని చూసి నేర్చుకోవాలి అంటూ, భారత్ – అమెరికాలు రెండూ వైవిధ్యానికి ప్రతికలే కనుక విభిన్నతను పరస్పరం గౌరవించుకుని, ఆ గౌరవ భావన మరింత పరిఢవిల్లేలా చూసుకోవాలి అని ఆకాంక్షించారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రతిభావంతులను గౌరవించడం వల్ల అన్ని వర్గాల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ముఖ్యం. సమ్మిళిత సూత్రం విశ్వవ్యాప్తం.. దాన్ని భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా అంతా గౌరవించాలి అని అన్నారాయన.