సోషల్ మీడియాలో పోస్టుల కేసులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ నేత శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ఇంచార్జీ గౌతు శిరీషను సీఐడీ అధికారులు విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.
ఈరోజు అనగా సోమవారం దాదాపుగా 7 గంటల పాటు ఆమెను విచారించారు. ఆమె న్యాయవాదిని కూడా లోపలకు రానివ్వకుండా ఆమెను విచారించారు. 7 గంటల పాటు విచారించినా భోజన సమయంలో తనకు ఆహారం ఇవ్వలేదు, విరామం కూడా ఇవ్వలేదని ఆవేదన చెందారు.
మంగళగిరి పరిధిలోని డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగంలో జరిగిన ఈ విచారణ ముగిసిన అనంతరం డీజీపీ కార్యాలయం బయట తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా గౌతు శిరీష సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేరం ఒప్పుకోవాలంటూ సీఐడీ అధికారులు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు. తప్పు చేయకుండా తప్పును ఒప్పుకోవడానికి తాను ససేమిరా అన్నట్టు ఆమె చెప్పారు. ఈ కేసును న్యాయపరంగానే తాను ఎదుర్కొంటానని సీఐడీ అధికారులకు తేల్చి చెప్పినట్లు ఆమె వెల్లడించారు.